తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పులో కాలేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో ‘చాలా చిన్నోడు..’ అంటూ కేసీయార్ చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. కేసీయార్ ఉద్దేశ్యం ప్రకారం, రాజకీయంగా ఈటెల బలం గురించి మాత్రమే ‘చిన్నోడు’ అని కావొచ్చు. కానీ, విషయంలో వేరేలా ప్రజలకు అర్థమవుతోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే, ‘కేసీయార్ ఏంటి.. ఇంత తేలిగ్గా మాట్లాడటమేంటి.? వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్‌ని.. పెద్ద సామాజిక వర్గానికి చెందిన కేసీయార్ దొర.. చిన్నోడిగా అభివర్ణించడం అస్సలేమాత్రం బాగా లేదు..’ అంటూ జనం చర్చించుకుంటున్నారు.
దళిత బంధు విషయమై, హుజూరాబాద్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కేసీయార్. ఈ క్రమంలో జిల్లాకి చెందిన పలువురు దళిత ప్రజా ప్రతినిథులతో కేసీయార్ మాట్లాడుతున్నారు. నేరుగా, ఆయనే కొందరికి ఫోన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా ప్రజా ప్రతినిథి భర్తతో కేసీయార్ మాట్లాడే సందర్భంలో ఈటెల చిన్నోడని, అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, ఈటెలతో వచ్చేదీ.. చచ్చేదీ ఏమీ లేదని అన్నారు. ఇదే ఇప్పుడు పెను దుమారానికి కారణమవుతోంది.
‘ఔను, నేను చిన్నోడ్నే.. చిన్నోడే ఎప్పుడైనా పెద్దోళ్ళతో కొట్లాడాల్సి వస్తుంది..’ అంటూ ఈటెల, కేసీయార్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ షురూ చేశారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా వున్న బలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఆ బలం పని చేయడంలేదు. దుబ్బాకలో పని చేయలేదు.. లోక్ సభ ఎన్నికల్లోనూ చాలా చోట్ల పని చేయలేదు.. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లోనూ ఆ బలం సరిపోలేదు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి బలమెంత.? అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. గెలిచి, తన స్థానాన్ని ఈటెల నిలబెట్టుకుంటే మాత్రం, కేసీయార్ ఊహించనంత పెద్దోడిగా ఈటెల ఎదిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Share
Recent Random Post: