వైఎస్ జగన్ పలుకుబడి కంటే రఘురామ పలుకుబడి ఎక్కువా.?

రఘురామకృష్ణరాజు ఓ ఎంపీ మాత్రమే. పైగా, అధికార పార్టీకి చెందిన రెబల్ ఎంపీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పైగా ముఖ్యమంత్రి. కేంద్రంతో వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ‘జగనన్న లేఖ రాస్తాడు.. కేంద్రం దిగొస్తుంది..’ అంటూ బులుగు బ్యాచ్ ప్రచారం చేసుకుంటుంటుంది. మరైతే, ప్రత్యేక హోదాపై జగనన్న లేఖ రాస్తే కేంద్రమెందుకు స్పందించడంలేదట.? అని ఎవరైనా ప్రశ్నించారో, దానికి చంద్రబాబు కుట్రలే కారణమంటూ అర్థం పర్థం లేని రాజకీయ విమర్శలతో సరిపెడ్తారు బులుగు నాయకులు.

ఇక, రఘురామ విషయానికొస్తే, రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు రఘురామ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. కేంద్రం సైతం, రాష్ట్రం చేస్తున్న అప్పులపై నిఘా పెట్టాలని రఘురామ లేఖలు రాస్తున్నారు. ఓ ఎంపీ రాసే లేఖల్ని కేంద్రం అంత సీరియస్‌గా పట్టించుకుంటుందా.? బ్యాంకులు, ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకుండా వుంటాయా.? ఇంగితం వున్నవాడెవడూ ‘అవును’ అని అనలేడు. కానీ, బులుగు మీడియా మాత్రం, రఘురామ కుట్రల కారణంగా, కేంద్రం.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలేదని అంటోంది. బ్యాంకులు సైతం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడానికి రఘురామ లేఖలే కారణమని తెగేసి చెబుతోంది.

ఒక్క రఘురామ.. ఒకే ఒక్క ఎంపీ.. ఆయనకే అంత పవర్ వుంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అను నిత్యం సంప్రదింపులు జరుపుతున్న వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, వైసీపీ ముఖ్యమంత్రి.. వీళ్ళందరికీ ఎంత పవర్ వుండాలి.? అంటే, రఘురామ లేఖ రాస్తే.. కేంద్రం నుంచి రావాల్సినవి ఆగిపోతాయి. అంతే తప్ప, వైసీపీ ఎంపీలు.. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కేంద్రం నుంచి నిధులు రావన్నమాట.

బులుగు మీడియా అంచనాలే నిజమైతే, రఘురామ ముందు మొత్తంగా బులుగు పార్టీ, అలాగే జగన్ ప్రభుత్వం చాలా వీక్ అని అనుకోవాల్సిందేనేమో. ఇదెక్కడి చోద్యం.? బులుగు మీడియా, అధికార పార్టీని పైకి లేపాలిగానీ, పాతాళానికి తొక్కేస్తే ఎలా.? వైసీపీ ప్రభుత్వానికి బులుగు మీడియా బలం కాదు.. శాపంగా మారుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు. గతంలో పచ్చ మీడియా, చంద్రబాబు పాలనని ఇలాగే తొక్కేసింది.


Recent Random Post: