వైసీపీ సర్కారు ‘పాలసీ ఉగ్రవాదం’: ట్వీటు బాంబు పేల్చిన జనసేనాని.!

‘తుమ్మెదల ఝుంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు.. సహజమే..’ అంటూ నిన్న ట్వీటాస్త్రం సంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా, మరో ట్వీటు బాంబు పేల్చారు. ఈసారి వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటోన్న ‘పాలసీ’లను ఉద్దేశించి ‘పాలసీ ఉగ్రవాదం’ అంటూ సంచలన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ తన ట్వీటు ద్వారా. అసలు ‘పాలసీ ఉగ్రవాదం’ అంటే ఏంటి.? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ‘పాలసీలు’ తెరపైకొచ్చాయి. ఇసుక పాలనీ, లిక్కర్ పాలసీ.. వంటి వాటి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వమే మద్యం దుకాణాల్ని నిర్వహించడం మద్యం పాలసీలో ప్రధాన అంశం. ప్రభుత్వం మద్యం దుకాణాల్ని నడపడమేంటి.? అని జనం ముక్కున వేలేసుకున్నారు. అంతేనా, కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయుల్ని పెట్టి మద్యాన్ని అమ్మించారనే విమర్శల్ని అప్పట్లో జగన్ సర్కార్ ఎదుర్కొన్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ఇక, ఇసుక పాలసీ విషయానికొస్తే.. ఈ పాలసీ కోసం ఆరు నెలలపాటు ఏకంగా ఇసుక విక్రయాల్ని ఆపేశారు. తద్వారా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడి, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితిని చూశాం. ఇసుక పాలసీనీ, లిక్కర్ పాలసీని పరిగణనలోకి తీసుకుని, రెండిటి గురించీ ఆలోచిస్తే.. కొత్త లిక్కర్ పాలసీ వచ్చేదాకా పాత లిక్కర్ పాలసీ కొనసాగింది.. ఎక్కడా లిక్కర్ సేల్స్ ఆగిపోలేదు. కానీ, ఇసుక పాలసీ విషయానికొస్తే.. కొత్త పాలసీ వచ్చేదాకా, ఇసుక అమ్మకాలు నిలిచిపోయాయ్. ఇదే పాలసీ ఉగ్రవాదం అంటే.. అని జనం భావిస్తున్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ట్వీటుకి జత చేస్తున్నారు.

ప్రశ్నించడం అంటే ఇదే.. జనసేనాని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్న ఎందుకు.? ఆ ప్రశ్నలోని అర్థమేంటి.? అనేది జనమే తేల్చుకోవాల్సి వుంటుంది. ప్రభుత్వ పాలసీలు కొన్నిసార్లు బెడిసికొట్టడం అడపా దడపా జరుగుతుండొచ్చగానీ.. ప్రజల్ని రోడ్డున పడేసేలా ఓ పాలసీ, ప్రభుత్వానికి ఖజానా వచ్చేలా ఇంకో పాలసీ.. ఇలాంటివి చేస్తేనే.. ‘పాలసీ ఉగ్రవాదం’ అనాల్సి వస్తోందన్నది మెజార్టీ నెటిజన్ల వాదన.

అయితే, ప్రభుత్వ పాలసీలకు సంబంధించి ‘పాలసీ ఉగ్రవాదం’ అనడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న కూడా కొందరి నుంచి ఉత్పన్నమవుతోంది. సమస్య తీవ్రతను తెలియజెప్పే క్రమంలో ఇంతటి ఘాటైన పోలిక సబబేనా.? కాదా.?


Recent Random Post: