వికేంద్రీకరణపై కొత్త చట్టమట.. కొంగొత్త నాటకమట.!

త్రీ క్యాపిటల్స్ పేరుతో వైఎస్ జగన్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించింది. ‘న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా వుండి వుండే.. మూడు రాజధానులకు సంబంధించిన ఫలాల్ని మనం అనుభవించేవాళ్ళమిప్పుడు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు.

ఎంత హాస్యాస్పదమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలివి.? ఆ మూడు రాజధానుల్లో ఒకటి అమరావతి.. అది శాసన రాజధాని. గడచిన రెండున్నరేళ్ళలో అమరావతిలో ఒక్క అధికారిక నిర్మాణమైనా ముందుకు నడిచిందా.? లేదాయె.

ఏ న్యాయస్థానమూ అమరావతిలో అభివృద్ధికి అడ్డం చెప్పలేదు. అలాంటప్పుడు, చంద్రబాబు హయాంలో ప్రారంభమైన నిర్మాణాల్లో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వాటిని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు కదా.? ఇంకా నయ్యం.. అలా చేస్తే, ఇప్పడిలా మాట్లాడుకోవాల్సిన అవసరమేముంది.?

‘తగ్గేదే లే.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వికేంద్రీకరణ బిల్లు కొత్తగా మళ్ళీ పెడతాం.. మూడు రాజధానులు చేసి చూపిస్తాం..’ అంటున్నారు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు. ఎలా.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తోన్న ప్రభుత్వాన్నీ నమ్మేదెలా.?
కొత్తగా అప్పు చేయనిదే రోజు తెల్లారడంలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అలాంటి రాష్ట్రం మూడు రాజధానుల్ని ఎలా కట్టగలదు.? ఏమాత్రం సోయ లేకుండా అధికార పార్టీ నేతలు, కీలక పదవుల్లో వున్నవారు వ్యాఖ్యానిస్తోంటే, గుడ్డిగా వారికి కొందరు మద్దతిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువుని మరింతగా బజార్న పడేస్తున్నారు.

వికేంద్రీకరణపై కొత్త బిల్లు తీసుకొస్తారట. తీసుకొచ్చేందుకు వీలుగా వైసీపీకి అసెంబ్లీలో, శాసన మండలిలో పూర్తి మెజార్టీ వుంది. ఈసారి ఎలాంటి అడ్డంకులూ వుండవు. కానీ, సమస్య ఏంటంటే.. ఎలాంటి లోపాలూ లేకుండా బిల్లుని తయారు చేయడం. మరి, ఆ సమస్యని అధిగమించగలదా వైసీపీ సర్కారు.. అన్నదే అసలు సమస్య.

కేంద్రంలో మోడీ సర్కారుకి పూర్తి బలం వుంది. ఉభయ సభల్లోనూ ఎన్టీయేకి తిరుగు లేదు. మరెందుకు కొత్త వ్యవసాయ చట్టాల్ని మోడీ సర్కార్ వెనక్కి తీసుకుంది.? సంఖ్యాబలంతో ఏదైనా చేయగలమనుకుంటే కుదరదుగాక కుదరదు. ఆ విషయం వైసీపీకి ఎప్పుడర్థమవుతుందో ఏమో.!


Recent Random Post: