దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా ? అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ పై కేసులున్నాయి. ఎప్పుడైతే ఇమ్రాన్ రాజీనామా చేయగానే మాజీ ప్రధానమంత్రి అయిపోతారు. దాంతో ఇప్పుడున్న ఇమ్యూనిటిలో చాలావరకు తొలగిపోతుంది. కాబట్టి అరెస్టు చేయటం చాలా తేలికవుతుంది.
ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. భాగస్వామ్య పార్టీలు మద్దతు ఉపసంహరించాయి. ఇదే సమయంలో మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులతో పాటు సొంత పార్టీకే చెందిన 24 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. దాంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చనే సంకేతాలు బలంగా ఉన్నాయి. సోమవారం పార్లమెంటులో బలప్రదర్శన జరగబోతోంది. అందుకనే ప్రభుత్వం పడిపోకముందే తానే రాజీనామా చేసే ఆలోచనలో ఇమ్రాన్ ఉన్నారట.
ఆదివారం ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ఇమ్రాన్ తన రాజీనామాను ప్రకటించబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటు రాజీనామా ప్రకటించటం అటు ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేయటం వెంటవెంటనే జరిగిపోతాయని సన్నిహిత వర్గాలు ఊహిస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వంపై సైన్యం విశ్వాసం కోల్పోయినట్లు ప్రచారం జరగుతోంది. పైగా ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి రాజీనామాను కోరినట్లు ప్రచారం.
మొదటి నుంచి పాకిస్థాన్ ప్రభుత్వంపై సైన్యానిదే సర్వాధిపత్యం. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగుతున్నా అధికారం మొత్తం సైన్యం చేతిలోనే కేంద్రీకృతమయ్యుంది. అందుకనే ప్రధానిగా ఎవరున్నా ముందు సైన్యాన్ని మంచి చేసుకునేందుకే ప్రాధాన్యతనిస్తారు. లేకపోతే ఎక్కువ రోజులు పదవిలో ఉండలేరన్న విషయం అందరికీ తెలుసు.
ఇపుడు ఇమ్రాన్ కు కూడా అలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. విచిత్రమేమంటే గతంలో పాకిస్థాన్ కు ప్రధానులుగా పనిచేసిన వారంతా ఏదో రూపంలో శిక్షలు అనుభవించాల్సొచ్చింది. లేకపోతే పర్వేజ్ ముషారఫ్ లాగా దేశం విడిచి పారిపోవాలి. మరి భవిష్యత్తులో ఇమ్రాన్ పరిస్థితి ఏమవుతుందో చూడాల్సిందే.
Recent Random Post: