చంద్రబాబు రాజకీయ నాటకాన్నీ జనసేన తిప్పి కొట్టాల్సిందే.!

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు..’ అన్న కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అత్యంత బాధ్యతాయుతంగా విపక్షాలకు పిలుపునిస్తే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం తమదైన ‘పచ్చ’ నాటకాలకు తెరలేపింది. ఓ వైపు జనసేన మీద ప్రేమ కురిపిస్తూ, తెరవెనుకాల వైసీపీకి సహాయ సహకారాలు అందిస్తోంది జనసేన పార్టీ మీద వైసీపీ విమర్శలు చేయడానికి.

‘పవన్ కళ్యాణ్‌ని తాడిపత్రికి ఆహ్వానిస్తున్నాం..’ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సెలవిచ్చారు. నిజానికి, జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, ఆ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కపటనాటకమే జనసేన శ్రేణుల్ని విస్మయానికి గురిచేస్తోంది.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతే, ముమ్మాటికీ వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నది ఓ పొలిటికల్ ఈక్వేషన్. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. కానీ, అందుకు అవకాశాలైతే వున్నాయి. అధికారం చేతిలో వుంది గనుక, దాన్ని నిలబెట్టుకోడానికి ఏ గడ్డి అయినా తినడానికి వైసీపీ వెనుకంజ వేయదు. ఓటర్లను ప్రలోభపెట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఓటర్లను భయపెట్టడంలో కూడా వైసీపీ దిట్ట.

ఈ వ్యూహాలతోనే వైసీపీ, స్థానిక ఎన్నికల్లో గెలిచింది. ఆ వ్యూహాలకు టీడీపీ బొక్క బోర్లా పడింది. టీడీపీ గనుక గట్టిగా నిలబడి వుంటే, వైసీపీ.. స్థానిక ఎన్నికల్లో చతికిలపడేదే. టీడీపీ క్యాడర్ కొంతమేర తెరవెనుకాల వైసీపీకి సహకరించిన మాట వాస్తవం. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత వెళ్ళకపోవడం అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యింది.

ఇలా వైఫల్యాలన్నీ తమవైపు పెట్టుకున్న టీడీపీ.. పనిలో పనిగా జనసేన పార్టీని కూడా బురదలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి సానుకూలంగానో, వ్యతిరేకంగానో.. చంద్రబాబు చిత్తశుద్ధితో స్పందించాలి తప్ప.. జనసేన మీద వైసీపీ విషం చిమ్మేలా అవకాశం కల్పించకూడదు.

కానీ, తాను చెడి.. ఇతరుల్నీ చెడగొట్టే నైజం టీడీపీది. ఆ నైజమే 2019 ఎన్నికల్లో టీడీపీని చెడగొట్టి, జనసేన విజయావకాశాల్నీ దెబ్బతీసింది. సో, 2024 ఎన్నికల నాటికి టీడీపీ వ్యూహాల పట్ల జనసేన అప్రమత్తంగా వుండాలి. వైసీపీ సంగతి జనం చూసుకుంటారు.. టీడీపీని మాత్రం జనసేన ఓ కంట కనిపెట్టాలి.


Recent Random Post: