సాయి పల్లవితో మణిరత్నం అంత మాట అనేశాడేంటి..?

సౌత్ సినిమాలకు ప్రస్తుతం నార్త్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ రూపొందిన ప్రతి సినిమాను అక్కడ డబ్బింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. రెండు దశాబ్దాల క్రితం సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులకు పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో తమిళ దర్శకుడు మణిరత్నం చేసిన ఎన్నో సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆదరించారు. మణిరత్నం సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆదరించిన మాదిరిగా మరే దర్శకుడి సినిమాలను వారు అప్పట్లో ఆదరించలేదు. మణిరత్నం హిందీలోనూ సినిమాలు చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ సైతం మణిరత్నం దర్శకత్వంలో నటించాలని కోరుకునేవారు.

తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషల్లో మణిరత్నం సినిమాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ప్రేక్షకుల్లోనే కాకుండా సెలబ్రిటీల్లో ఎంతో మంది ఆయనకు అభిమానులు అనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా లేదా ఒక్క సీన్‌ చేసినా చాలు అన్నట్లుగా చాలా మంది నటీ నటులు ఉంటారు. అలాంటిది ఆయన ఒక హీరోయిన్‌తో సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఒక సినిమా ఈవెంట్‌ లో చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం నుంచి ఇలాంటి మాటలు వస్తాయని అనుకోలేదు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

శివ కార్తికేయన్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందిన ‘అమరన్‌’ సినిమా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఆ ఈవెంట్‌లో దర్శకులు లోకేష్‌ కనగరాజ్‌, మణిరత్నం హాజరు అయ్యారు. సినిమా వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ.. సాయి పల్లవికి నేను పెద్ద అభిమానిని, ఏదో ఒక రోజు మీతో కలిసి సినిమా చేస్తాను అన్నారు. సాయి పల్లవి సైతం ఆ మాటలకు షాక్ అయ్యింది. మణిరత్నం వంటి గొప్ప దర్శకుడి నోటి నుంచి ఇలాంటి మాట వస్తుందని ఆమె సైతం ఊహించి ఉండదు. అందుకే ఆయన మాటలకు షాక్ అయిన ఆమె ఏం మాట్లాడాలో పాలుపోక అలాగే చూస్తూ ఉంది.

కొద్ది సమయం తర్వాత సాయి పల్లవి మాట్లాడుతూ… నేను సినిమాల్లోకి రాక ముందు నుంచి మణిరత్నం సర్‌ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలను చూసి నేను స్క్రిప్ట్‌లను ఎంపిక చేయడం నేర్చుకున్నాను. పాత్రలు, కథల విషయంలో ఆయన నుంచి చాలా విషయాలను సినిమాలు చూసి నేర్చుకున్నాను అంది. ఆయన దర్శకత్వంలో నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ మాదిరిగానే నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఆయనతో కలిసి వర్క్ చేస్తాను అంది. గతంలో మణిరత్నం, సాయి పల్లవి కాంబినేషన్‌లో మూవీ గురించి చర్చలు జరిగాయి. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా లో సాయి పల్లవి నటించలేదు. ఆ స్థానంను అదితి రావు హైదరి భర్తీ చేసింది. సాయి పల్లవి ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వకుండా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. కథల విషయంలో కొన్ని కండిషన్స్ పెడుతున్న సాయి పల్లవి, భవిష్యత్తులో మణిరత్నం సినిమాకు ఓకే చెబుతుందా అనేది చూడాలి.


Recent Random Post: