పారామౌంట్ vs లైకా: ‘విడాముయర్చి’ కాపీ వివాదం


ఒకప్పుడు విదేశీ భాషల సినిమాలను మన ఫిల్మ్‌మేకర్లు స్వేచ్ఛగా కాపీ చేసి సినిమాలు తీయడం సాధారణమే. ఆ రోజుల్లో ఒరిజినల్ మేకర్స్‌కు ఈ విషయమై సమాచారం అందకపోవడంతో పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ సోషల్ మీడియా, డిజిటల్ యుగం రాగానే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సమాచార ప్రసారం ప్రపంచవ్యాప్తంగా సులభతరం కావడంతో మన సినిమాలకు అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ పెరిగింది. ఈ క్రమంలో కొంతమంది విదేశీ ఫిల్మ్‌మేకర్లు తమ కంటెంట్ కాపీ అయిందని గమనించి, లీగల్ చర్యలకు దిగుతున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం సమయంలో కూడా ఇదే జరిగింది. ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాలే తన చిత్రం ‘లార్గో వించ్’ను కాపీ చేశారని ఆరోపించారు. అయితే, లీగల్ యాక్షన్‌కి వెళ్లకుండానే ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు, హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మాత్రం తమ సినిమా ‘బ్రేక్‌డౌన్’ను కాపీ చేశారనే కారణంగా తమిళ చిత్రం ‘విడాముయర్చి’పై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘విడాముయర్చి’ ట్రైలర్ విడుదల తర్వాత, పారామౌంట్ తమ కథానుసారం ఈ సినిమా నిర్మితమైందని భావించి, లైకా ప్రొడక్షన్స్‌కి రూ.85 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపినట్లు సమాచారం. సంక్రాంతి విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం వాయిదా పడటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

అయితే, అంత పెద్ద మొత్తం చెల్లించడం వల్ల భారీ నష్టం వస్తుందని లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది. అందుకే, తమ నుంచి పారామౌంట్‌కి భాగస్వామ్య ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ వాడుకకు అనుగుణంగా నిర్మాతలుగా పారామౌంట్‌కు వాటా ఇవ్వడం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రాజీ ఒప్పందం ఫైనల్ అయిన తరువాతే సినిమా విడుదలపై స్పష్టత రానుంది.


Recent Random Post: