కులమతాలకు అతీతుడు ఎన్టీఆర్: బాలకృష్ణ

పార్టీలకు, కులమతాలకు అతీతుడైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్.. సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడ అవినీతిని భరించలేక, ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగంలోకి అడుగు పెట్టారని తెలిపారు.

ప్రపంచంలో ఎవరూ చేయలేని ఎన్నో గొప్ప పాత్రలను ఆయన చేశారన్నారు. భారతీయ సినిమా రంగంలో అగ్ర హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారని కొనియాడారు. అనంతరం ప్రజలకు ఏదైనా చేయాలనిపించి తెలుగు దేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు.

మహిళలకు ఆస్థిలో సమాన హక్కును కల్పించడం, స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్స్‌ను కల్పించడం, పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం అందించడం వంటి ఎన్నో మంచి పనులు చేశారని వివరించారు. భౌతికంగా ఆయన మన ముందు లేకపోయినా, స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా ఉండిపోతారని పేర్కొన్నారు.


Recent Random Post: