బాబులిద్దరూ విజిటింగ్ ప్రొఫెసర్లేనా… ?

రాజకీయం అంటే ఆశ ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. శ్వాస ఎలా అపడం వల్లకాదో అలాగే రాజకీయాన్ని కూడా ఆపకుండా చేస్తూ పోవాలి. సమస్య అన్నది వచ్చినపుడు నాయకుడు కనబడడం కాదు సమస్య కంటే ముందే రావాలి. జనంలో ఒకడిగా నిలవాలి. పార్ట్ టైమ్ పాలిటిక్స్ కి రోజులు చెల్లాయని అనేక ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తూన్నా ఫార్టీ ఇయర్స్ పార్టీ హై కమాండ్ కి అర్ధం కాకపోవడమే బాధాకరమే. ఇక దీని మీద వగచి వాపోతున్నారు అంటే ఆ తప్పు తమ్ముళ్లది కాదేమో. టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అక్కడ అనేక ఆంక్షలు ఉంటాయి. ఎందరు నాయకులు ఉన్నా హై కమాండ్ మాత్రమే ముందుకు కదిలితేనే ఊపు వస్తుంది. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అది కూడా గత రెండున్నరేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న వారు ఎక్కడో దూరానా కూర్చుంటే కధ ఎలా నడుస్తుంది. ఇది టీడీపీ తమ్ముళ్ల మదిలో ఎపుడూ మెదిలే విషయమే.

టీడీపీకి అధినాయకుడు చంద్రబాబు భావి నాయకుడు లోకేష్. ఈ ఇద్దరూ ఉన్నది హైదరాబాద్ లో. చంద్రబాబు అయిదేళ్ల పాటు విభజన ఏపీకి సీఎం చేసినా సొంత ఇల్లు మాత్రం ఎక్కడా లేదు అంటుంది వైసీపీ. మరి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు అన్నది తప్పు కాదు కానీ రాజకీయ క్షేత్రమైన ఏపీలో ఉండాలి కదా అన్నది టీడీపీ శ్రేణుల మాట. జనం మాట కూడా. టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏపీలో పార్టీకి అందుబాటులో లేకపోవడం దారుణమే అంటున్నారు.

ఏపీలో ఈ రోజుకీ బలమైన పార్టీ టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న పార్టీ కూడా అదే. అటువంటి పార్టీని మళ్ళీ నిలబెట్టి అధికార పక్షం మీద పోరాడడానికి అవసరమైన సత్తువ అందించే బాధ్యత అక్షరాలా అధినాయకత్వానిదే. మరి చంద్రబాబు లోకేష్ ఏపీకి విజిట్ చేయడానికే వస్తున్నారు తప్ప ఇక్కడే ఉండడం లేదు అన్న అసంతృప్తి అయితే క్యాడర్ లో ఉంది. మూడు వందల అరవై రోజులూ అధినాయకత్వం తమకు అందుబాటులో ఉండాలని క్యాడర్ కోరుకోవడం తప్పు కాదు కదా.

అయినా సరే పరామర్శల పేరుతో లోకేష్ ఏపీలో ఇలా కనిపించి అలా వెళ్ళిపోతారు. ఇక చంద్రబాబు టూర్ల పేరు మీద వస్తూంటారు వెళ్తూంటారు ఇలాగైతే టీడీపీ ఎలా ఎదిగేను గద్దెనెలా అధిరోహించేనూ అన్న ప్రశ్నలు రావడం సహజం. టీడీపీ ఈ లాజిక్ ని మిస్ అయి నేల విడిచి సాము చేస్తే ఫలితాలు వస్తాయా అన్న చర్చ కూడా ఉంది. ఇక్కడ మరో చిత్రం కూడా చూడాలి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అక్కడకు కూడా ఆయన ఇలా వచ్చి అలా వెళ్తారని వైసీపీ ప్రచారం చేయడం వల్లనే ఇపుడు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పొలిటికల్ సీన్ వచ్చింది. ఇపుడు ఏపీకి చుట్టపు చూపుగా ఇద్దరు బాబులు వస్తున్నారు అని వైసీపీ తెగ గోల చేస్తోంది. అది కూడా జనాలలోకి వెళ్తుంది కదా. మరో వైపు పార్టీని ఉత్సాహపరచి ఉరకలు పెట్టించాలి అంటే కచ్చితంగా ఏ విజయవాడలోనో గుంటూరులోనో టీడీపీ అధినాయకుడు నివాసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న మాట కూడా వినిపిస్తోంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే విజింటింగ్ ప్రొఫెసర్లు అన్న వైసీపీ మాటలే జనాలూ నిజమనుకుంటారు.


Recent Random Post: