ఏపీ పదమూడు జిల్లాల విభజన రాష్ట్రం. ఉమ్మడి ఏపీలో అంతా ఏపీ గురించే చర్చించేవారు. నాడు సంపన్న ప్రాంతంగా చెప్పుకునే వారు. అయితే అదంతా బంగారు కొండ లాంటి భాగ్యనగరం పుణ్యమా అని వచ్చిన వెలుగు జిలుగులే తప్ప వేరేగా ఏపీని చూస్తే ఏమీ లేదన్నది ఏడేళ్ల చరిత్ర చెబుతోంది. ఏపీ విషయంలో ఇపుడు తలచుకుంటేనే గుండె చెరువు అయ్యేలా ఉందని అంటున్నారు. నిజమే ఏపీ అప్పుల కుప్ప. ఇది కూడా చిన్న మాటే. ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న రాష్ట్రం. ఈ మాట అంటే ఈ రోజుకు కరెక్ట్. ఎందుకంటే రేపటికి ఇంకా దారుణంగా పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు కాబట్టి.
ఇదిలా ఉంటే ఏపీ అప్పు అక్షరాలా ఆరు లక్షల 22 వేల 599 కోట్ల రూపాయలు. ఇప్పటికి జగన్ ఏలుబడి సగం మాత్రమే పూర్తి అయింది. ఇంకా మరో సగం పూర్తి కావాలి. జగన్ ప్రభుత్వం ఈ రోజుకు మూడు లక్షల కోట్ల అప్పు తెచ్చింది అన్నది ఆర్ధిక ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఆధారాలతో సహా చెబుతున్న మాట. అంటే జగన్ పాలన పూర్తి అయ్యేసరికి కచ్చితంగా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిందే. దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు కలిపితే కచ్చితంగా పది లక్షల కోట్లతో 2024 ఎన్నికలలో గెలిచే పార్టీకి ఏపీ అధికారం బదలాయింపు జరుగుతుంది.
మరి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నేను గెలిచి సీఎం గానే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసి మరీ బయటకు వచ్చారు. ఒక విధంగా జగన్ పాలన విషయంలో ఆయనకు ఏ అడ్డూ లేకుండా చేసి మరీ వచ్చారన్న మాట. మరి చంద్రబాబు తన బాధ్యతను ఇక్కడే విస్మరించారు అని అందరూ అంటున్నారు. జగన్ సర్కార్ ని కనీసం కట్టడం చేయగల అవకాశం ఒక్క చంద్రబాబుకే ఉంది. చంద్రబాబు మాట జగన్ వింటారా లేదా అన్నది పక్కన పెడితే ఆ విధంగా ఎక్కడికక్కడ చెక్ చెప్పినట్లైతే జనం దృష్టిలో అయినా బాబుకు నైతికత పెరిగేది.
కానీ మరో రెండున్నరేళ్లు ఈ రాష్ట్రాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి నేనొచ్చి అన్నీ చక్కదిద్దుతాను అన్నట్లుగా బాబు బాయ్ కాట్ చేసేశారు. ఒక వేళ బాబు అనుకుంటున్నట్లుగా టీడీపీ 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆయన సీఎం అయి కూడా పది లక్షల కోట్ల అప్పుతో నిలువుగా ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించగలరు అన్న ప్రశ్న అయితే మేధావులతో పాటు అందరిలో కలుగుతోంది. చంద్రబాబుకు ఏమైనా మ్యాజిక్కులు తెలుసా. ఏపీలో అప్పులన్నిటినీ ఒక్క దెబ్బకు అలా మాయం చేయగలరా అన్న చర్చ కూడా నడుస్తోంది.
నిజానికి తానే అపర మేధావిని అని చెప్పే చంద్రబాబే రెండున్నర లక్షల కోట్లు అప్పు తన అయిదేళ్ల కాలంలో చేశారు. జగన్ పాలన సగానికి వచ్చేసింది. కొత్త అప్పు పుట్టే చాన్సే లేదు. అయినా ఉన్నవీ లేనివీ అన్నీ తాకట్టు వాకట్టు పెట్టి ఎలాగో జగన్ తన పాలన పూర్తి చేస్తారనుకుంటే అపుడు బాబు వచ్చి దివాళా పూర్తిగా తీసిన ఏపీని ఎలా కాపాడగలరు అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. మొత్తానికి ఏపీని బాబే కాదు మోడీ వచ్చి సీఎం సీట్లో కూర్చున్నా బాగు చేయలేడు అన్న బాధతో కూడిన సందేహాలైతే జనాలకు వస్తున్నాయి. మరి ఏపీని బాగు చేయడం మాట దేముడెరుగు కనీసం ఇలాగైనా ఉంచే శక్తి పాలకులకు ఉందా అన్నదే డౌట్.
Recent Random Post: