‘కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..
‘‘వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019కి 3లక్షల అప్పు ఉంటే.. జగన్ 32నెలల పాలనలో అది 7లక్షలకు పైగా అయింది. ఏపీ భవిష్యత్ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలి.. జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి. ఇటువంటి సమయంలో ప్రజా చైతన్యం అవసరం. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో పాలన ప్రారంభించారు. రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా 50వేల ఎకరాలు ఇస్తే అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వాలు ఇలాగే చేస్తే హైదరాబాద్ ఉండేదా?. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి ఇప్పుడు మాట తప్పారు.
అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే ఏపీకి భవిష్యత్తు. 2021కి పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం, మంత్రి ఇప్పుడెక్కడున్నారు..? ఏపీకి ప్రాజెక్టులు తేవడమంటే విధ్వంసం చేసినంత సులువు కాదు. మేము 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశాం. అవి వస్తే 30వేల ఉద్యోగాలు వచ్చేవి. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రంలో వరి వేయొద్దంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం అన్నారు.. కానీ, టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారు.
జాబ్ క్యాలెండర్ అని చెప్పి.. జాబ్‌లెస్ క్యాలెండర్ ఇచ్చారు. ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. దాడులు చేస్తున్నారు. చెత్తమీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డిది. అన్న క్యాంటీన్లు మూసివేశారు? రెండేళ్లలో కరెంట్ ఛార్జీలను ఆరుసార్లు పెంచారు. మద్యనిషేధం అంటూ రాష్ట్రంలో మద్యంపై పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారు. మేము ఇసుక ఉచితంగా ఇస్తే గొడవ చేసి.. ఇప్పుడు 5రెట్లు ఎక్కువకు దోచుకుంటున్నారు. ఓటీఎస్ పేరుతో దోపిడీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Recent Random Post: