చంద్రబాబు అక్రమాస్తుల కథేంటో నిజంగానే తేలిపోతుందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పై అక్రమాస్తుల కేసు విచారణ కొన‘సాగు’తున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు, అధికారులు కూడా నిందితులుగా వున్న విషయం విదితమే.

మరోపక్క, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా అక్రకమాస్తుల కేసు ఒకటి నడుస్తోంది. ప్రస్తుత వైసీపీ నేత లక్ష్మీ పార్వతి 2006లో వేసిన కేసు అది. అప్పటినుంచి, ఆ కేసు విచారణ అలా అలా నడుస్తూ, వాయిదా పడుతూ వస్తోంది. ఈ కేసులో ఈ నెల 18న తీర్పు రాబోతోందట. అయితే, ఆ తీర్పు ఎలా వుండబోతోంది.? అన్నదానిపై వైసీపీ మద్దతుదారులు రకరకాల ప్రచారాలు తెరపైకి తెస్తున్నారు.

చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయమనీ, నిప్పు నారా చంద్రబాబునాయుడు తుప్పు వదిలిపోతుందన్నది వైసీపీ అభిమానుల భావన. కానీ, ఆయా కేసులు, వాటి విచారణలు జరుగుతున్న తీరు చూస్తే, చంద్రబాబుని ఈ కేసు మరీ అంతలా ఇబ్బంది పెట్టే అవకాశం వుందా.? అన్న అనుమానాలు కలగడం సహజమే.

అయితే, జయలలిత అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెల్సిందే. ఆ లెక్కన ఈ తరహా కేసుల్ని అంత లైట్ తీసుకోవడానికి వీల్లేదు.. తక్కువ అంచనా వేయడానికి అసలే వీల్లేదు. కాగా, చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి, ఈ కేసు నుంచి తెలివిగా తప్పించుకుంటారన్న అభిప్రాయం పచ్చ చొక్కాల్లో వుందనుకోండి.. అది వేరే సంగతి.

ఇంకోపక్క, బీజేపీ నేతలు మాత్రం, కొత్త ఏడాదిలో చంద్రబాబుకి జైలు యోగం వుందంటూ జోస్యం చెబుతున్నారు. అయితే, ఆ జోస్యం 2019 నుంచీ అలాగే వినిపిస్తోంది తప్ప, వాస్తవ రూపం దాల్చడంలేదు. చంద్రబాబు జేబులో వంద రూపాయల నోటు కూడా వుండదు.. అంత క్లీన్ పాలిటిక్స్ ఆయన చేసేస్తుంటారన్నది తెలుగు తమ్ముళ్ళ ఉవాచ.

కానీ, చంద్రబాబుకి బోల్డన్ని బినామీ ఆస్తులు వున్నాయన్నది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు, ఆ కారణంగానే తప్పించుకుంటున్నారా.? ఈసారీ తప్పించుకోవడం కుదురుతుందా.? ఏమో, జనవరి 18 వరకూ వేచి చూడాల్సిందే.


Recent Random Post: