మనకు చేతకాదన్న వారికి.. మన సత్తా చూపిస్తున్నాం: సీఎం కేసీఆర్

ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ప్రయాణిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రగతి పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సమీకృత కలెక్టరేట్‌ భవనం, సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డు, గిడ్డంగులు, నర్సింగ్‌ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్‌ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..

‘ఫలితాలు మనముందే కాదు.. యావత్‌ ప్రపంచం ముందు కూడా కనిపిస్తున్నాయి. మనకు అపనమ్మకాలు ఎక్కువ.. కానీ లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి తోడైతే ఏదైనా వందశాతం అవుతుంది’ అని అన్నారు. తెలంగాణ వారికి ఏమీ రాదని గతంలో కొందరు అన్నారు.. కానీ.. అన్నింటికీ సమాధానం చెప్తున్నాం. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలకు డిజైన్‌ చేసింది తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డి.. వాటిని కడుతుంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి’ అని సీఎం తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ఇచ్చిన హామీ మేరకే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తాం. ఎస్సీల కోసం వచ్చే నాలుగేళ్లలో 45 వేల కోట్లు ఖర్చు చేస్తాం. నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నాం. ఫస్ట్ ఇయర్ నర్సింగ్‌ విద్యార్థులకు 5 వేలు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 6 వేలు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు 7 వేలు స్టైఫండ్‌ ఇస్తాం. రాజన్న సిరిసిల్లకు ఖచ్చితంగా వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాలు వస్తాయి. రాజన్న ఆలయం స్థాయి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే 5 లక్షల బీమా.. సిరిసిల్లలో కమ్యూనిటీ హాలు కోసం 5కోట్లు మంజూరు చేస్తున్నా’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

ఈ బహిరంగ సమావేశంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Recent Random Post: