శ్రీకాంత్ తన కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించాడు. ఆ తరువాత హీరోగా మారిపోయి చాలా వేగంగా 100 సినిమాలను పూర్తి చేశాడు. అలాంటి శ్రీకాంత్ మళ్లీ ఇంతకాలానికి ‘అఖండ’ సినిమాతో పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఇక తాను విలన్ గా బిజీ అవుతానని ఆయన భావిస్తున్నాడు. నిన్నరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ .. “బాలయ్య బాబు అభిమానులందరికీ నమస్కారం. ఈ ఎనర్జీ చూస్తుంటే డిసెంబర్లో థియేటర్లలో దబిడిదిబిడే అనిపిస్తోంది.
ఈ ఫంక్షన్ కి వచ్చిన రాజమౌళిగారికీ .. బన్నీగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. బోయపాటి – బన్నీ కాంబినేషన్లో నేను ‘సరైనోడు’ చేశాను. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్యబాబుగారితో ‘శ్రీరామరాజ్యం’లో లక్ష్మణుడిగా చేశాను. ఈ సినిమాలో రావణాసురుడిగా చేశాను. నేను ఇదంతా కలే అనుకుంటున్నాను. నా ఫేస్ చూస్తే చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంటాను. బాబాయ్ కేరక్టర్లు వస్తుంటాయి. మరి నాలో బోయపాటిగారు ఏం చూశారో తెలియదుగానీ నన్ను విలన్ ను చేస్తానని ‘సరైనోడు’ సినిమా సమయంలోనే చెప్పారు. చిన్నచిన్న వేషాలు ఒప్పుకోవద్దు అన్నారు.
అలాగే అంటార్లే .. ఎక్కడ చేస్తారు అనుకున్నాను. అందుట్లో బాలకృష్ణ సినిమాల్లో విలన్ పాత్ర అంటే జోక్ కాదు. ఆయన ఎనర్జీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆయన డైలాగ్స్ హై ఓల్టేజ్ లో ఉంటాయి. ఫస్టు డే .. ఫస్టు షాటే ఆయన కాంబినేషన్లో పడింది .. అయిపోయానురా బాబోయ్ అనుకున్నాను. ఆయన డైలాగులు చెబుతూ ఉంటే నాకు టెన్షన్ వచ్చేది. ఎలా చేయాలిరా బాబూ అనుకుని నేను శ్రీకాంత్ ను అనే విషయాన్ని మరిచిపోయి నా పాత్ర వరదరాజులుగానే అనుకుని ఆయన ముందుకు వెళ్లేవాడిని.
బాలకృష్ణ గారు నాకు చాలా కోపరేట్ చేశారు. నన్ను ఎంకరేజ్ చేసి చేయించారు. బాలకృష్ణగారు ఉందయం నుంచి సాయంకాలం వరకూ అదే ఎనర్జీతో ఉంటారు. బోయపాటి – బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది అందరూ థియేటర్లలో చూడబోతున్నారు. ఈ సినిమాను ఉదయాన్నే మార్నింగ్ షోకి వెళ్లి ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాతో అన్ని చోట్లా థియేటర్లు నిండిపోతాయని భావిస్తున్నాను” అంటూ ముగించారు.
Recent Random Post: