కేసీఆర్‌ క్యాబినెట్‌లోకి కవిత.. అతి త్వరలో.!

లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా, ఎమ్మెల్సీగా కుమార్తెకు పదవి ఇచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. చాలాకాలంగా మంత్రి పదవి విషయమై కుమార్తె కవిత నుంచి కేసీఆర్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే.

నిజానికి, లోక్‌సభ కంటే కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే తొలుత భావించారు. కానీ, ఈక్వేషన్స్‌ సెట్‌ అవలేదు అప్పట్లో. ఎలాగైతేనేం, ఓ సారి లోక్‌సభకు ఎంపికై, రెండో సారి ఓడిన కవిత, ఎట్టకేలకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. దాంతో, కేసీఆర్‌ క్యాబినెట్‌లో చేరేందుకు కవితకు లైన్‌ క్లియర్‌ అయినట్లే కనిపిస్తోంది.

త్వరలో మంత్రి వర్గంలో చేరబోతున్నట్లు కవిత, తాజాగా.. అదీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారట. ఇంకేముంది.? టీఆర్‌ఎస్‌లో కవిత వర్గం హంగామా అంతా ఇంతా కాదు. టీఆర్‌ఎస్‌లో చాలా గ్రూపులున్నాయి. కేటీఆర్‌ గ్రూపు, హరీష్‌రావు గ్రూపు.. వాటితోపాటు కవిత గ్రూపు కూడా వుంది. కవిత, ఎమ్మెల్సీ అయ్యాక ఆమె గ్రూప్‌ మరింత బలోపేతమయ్యింది. దుబ్బాక ఉప ఎన్నిక దెబ్బకి హరీష్‌రావు గ్రూప్‌ బాగా వీక్‌ అయిపోందన్న ప్రచారం జరుగుతోంది.

కాగా, హరీష్‌రావు ఇమేజ్‌ని పార్టీలో తగ్గించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, అయితే.. ఆయా సందర్భాల్లో పార్టీ కోసం తప్పనిసరై హరీష్‌రావుకి పార్టీలో కీలక పదవుల్ని కట్టబెట్టాల్సి వచ్చిందనీ, సరైన సమయం దొరికితే హరీష్‌కి షాకివ్వడానికి అటు కేసీఆర్‌, ఇటు కేటీఆర్‌ చూస్తున్నారనీ.. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులు ఈ విషయమై ఎప్పటినుంచో రకరకాల జోస్యాలు చెబుతూ వచ్చారు. ఆ జోస్యాలు ఇప్పుడు నిజమయ్యేలా వున్నాయి.

‘అబ్బే, మేమంతా కలిసే వున్నాం..’ అని చాలా సందర్భాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్‌రావు చెప్పినా.. అసలు కథ ఇప్పుడే మొదలయ్యిందన్న చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే జరుగుతుండడం గమనార్హం. మరోపక్క, కవితకు మంత్రి పదవి విషయమై కేటీఆర్‌ వర్గం కూడా కొంత ఆందోళన చెందుతోందని సమాచారం.

పార్టీలో రెండు పవర్‌ సెంటర్లు ఏర్పడితే, అది పార్టీకి నష్టమన్న వాదనా లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పటికే కేసీఆర్‌ కుటుంబంలో ముగ్గురికి కీలక పదవులున్నాయి. తాజా ఊహాగానాలు నిజమై, కవితకూ మంత్రి వర్గంలో చోటు దక్కితే.. కుటుంబ పార్టీ.. కుటుంబ పాలన.. అన్న విమర్శ సంపూర్ణంగా నిజమవుతుందన్నమాట.


Recent Random Post: