వెండితెరపై మంజుల ఘట్టమనేని రీఎంట్రీ

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె.. మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని పరిచయం అవసరం లేదు. నటి కం నిర్మాతగా దర్శకురాలిగా సుపరిచితం. `షో` అనే జాతీయ అవార్డ్ చిత్రంతో మంజుల సోలో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఒకే ఒక్క పాత్రతో రూపొందించిన చిత్రమిది. నీలకంఠ ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఒక దశాబ్దం తర్వాత సుమంత్ నటిస్తున్న తదుపరి చిత్రంతో తిరిగి నటనలో రీఎంట్రీ ఇస్తున్నారు.

సుమంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు సినిమా `మళ్లీ మొదలైంది`లో డాక్టర్ మిత్ర అనే థెరపిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మంజుల లుక్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్ ని షేర్ చేసిన మంజుల వివరాల్ని వెల్లడించారు. `మళ్లీ మొదలైంది` చిత్రంలో డాక్టర్ మిత్ర అనే థెరపిస్ట్ గా నటించడం సరదాగా ఎగ్జయిటింగ్ గా ఉందని మంజుల అన్నారు. సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ పోస్ట్ కి `థాంక్స్ సిస్` అంటూ సుమంత్ రిప్లయ్ ఇచ్చారు. సుహాసిని మణిరత్నం -వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విడాకుల అనంతరం పునర్వివాహం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందే శుభలేఖను షేర్ చేసి సుమంత్ హీట్ పెంచారు. సుమంత్ కి మళ్లీ పెళ్లి అంటూ మీడియా చాలానే సందడి చేయగా.. అబ్బే అలాంటిదేమీ లేదు.. ఇది కేవలం మూవీ ప్రమోషన్ అంటూ చల్లగా చెప్పారు.

మంజుల స్వగతం కెరీర్ ని పరిశీలిస్తే.. `సమ్మర్ ఇన్ బెత్లెహాం` సినిమాతో 1998 లో తొలిసారిగా నటించినా తెలుగు సినిమా `షో` తనకు నటిగా గుర్తింపు తెచ్చింది. తరువాత నిర్మాతగా మారి నాని- పోకిరి- కావ్య డైరీ -ఏ మాయ చేసావే వంటి చిత్రాలను నిర్మించారు. 2018 లో విడుదలైన `మనసుకు నచ్చింది` అనే సినిమాతో ఆమె దర్శకురాలిగా రంగ ప్రవేశం చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. మంజుల ఘట్టమనేని చివరిగా 2010 లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సోదరిగా మంజుల నటించారు. మంజుల ఇటీవల యూట్యూబ్ చానెల్ ప్రారంభించి తనదైన శైలిలో వెబ్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసినదే.


Recent Random Post: