ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా కలిసొచ్చింది. వరుసగా రెండు దఫాలు.. అంటే, పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు, ఎలాగైతేనేం ముఖ్యమంత్రి అయ్యారు 2014 ఎన్నికల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి. ఓ వైపు జనసేన మద్దతు, ఇంకో వైపు బీజేపీతో పొత్తు చంద్రబాబుకి కలిసొచ్చింది. కానీ, 2019 ఎన్నికలొచ్చేసరికి సీన్ మారిపోయింది. ఎవరికి వారే.. అన్నట్టు ముగ్గురు మిత్రులూ విడిపోవాల్సి వచ్చింది. విడిపోయి.. ముగ్గురూ నష్టపోయిన మాట వాస్తవం. అది ఎవరి వల్ల కలిగిన నష్టం అన్నది వేరే చర్చ. వైసీపీ మాత్రం బాగా లాభపడింది.. బంపర్ మెజార్టీతో అధికారపీఠమెక్కింది.
అప్పటినుంచి చంద్రబాబు, వైసీపీని దెబ్బతీసే క్రమంలో అప్పటిదాకా శత్రువు అనుకున్న నరేంద్ర మోడీపై మాటల దాడి తగ్గించారు. కానీ, బీజేపీ మాత్రం చంద్రబాబు తమను వెన్నుపోటు పొడిచాడనే నమ్మతోంది. జనసేన కూడా, టీడీపీ వైపు కన్నెత్తి చూడటంలేదు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో జనసేన, బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే. నిజానికి, ఈ ప్రతిపాదన బీజేపీ నుంచే వచ్చింది. అయితే, 2024 లేదా అంతకన్నా ముందు ఎన్నికలు జరిగితే బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా.? లేదంటే, చంద్రబాబు కూడా కలిసి.. మొత్తంగా ముగ్గురూ పోటీ చేస్తారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాపు సామాజిక వర్గానికి గాలం వేసే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద అమితమైన ప్రేమ ఒలకబోయక తప్పడంలేదు చంద్రబాబుకి. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీసీలు తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారనే నమ్ముతున్నారు చంద్రబాబు. అయినాగానీ, వైసీపీని దెబ్బ కొట్టాలంటే సొంత బలం సరిపోదన్నది చంద్రబాబు తాజా అంచనా.
వివిధ కేసుల్లో ప్రభుత్వానికి తగులుతున్న ఎదురు దెబ్బలు.. జాబ్ క్యాలెండర్ విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు.. ఇలా చాలా అంశాల్ని విశ్లేషించిన చంద్రబాబు, బీజేపీ – జనసేనతో విడివిడిగా చర్చలు వీలైనంత త్వరగా చేపట్టాలనుకుంటున్నారట. ఢిల్లీలోని తమ వేగుల్ని ఇప్పటికే అలర్ట్ చేసిన చంద్రబాబు, వీలైతే ఢిల్లీ వెళ్ళాలని కూడా చూస్తున్నారని సమాచారం. కానీ, జనసేన అందుకు సమ్మతిస్తుందా.? బీజేపీ, ఇంకోసారి బాబు వలలో పడుతుందా.? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్.
2014 నాటి ఈక్వేషన్ వర్కవుట్ అవ్వాలంటే, తప్పదు.. చంద్రబాబుతో బీజేపీ, జనసేన జతకట్టాల్సిందేననే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. అంతా బాగానే వుందిగానీ, కూటమి కుదిరితే.. సీట్ల పంపకం సహా చాలా విషయాల్లో చంద్రబాబు పెత్తనం గతంలోలా మాత్రం కుదరదు. జనసేన నుంచి డిమాండ్లు గట్టిగానే వుంటాయ్ మరి. ‘పవర్’ పరంగా షేరింగ్, జనసేనకూ గట్టిగానే వుండాలి. అంటే, అందులో ముఖ్యమంత్రి పదవి పంపకం.. కొన్నాళ్ళు చంద్రబాబు, కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నట్టు.. మరి, చంద్రబాబు దానికీ సిద్ధపడినట్లేనా.?
Recent Random Post: