దేవుడట.. రాముడట.. మూర్ఖుడట.! ఏందిది లోకేశం.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు దేవుడట.! ఔను, ఆయన దేవుడే. ఎందుకంటే, ఫలానా దేవుడెలా వుంటాడంటే, ఎన్టీయార్ ఫొటోనే చూపించేవారు ఒకప్పుడు. అంతలా, దేవుడి సినిమాలతో పాపులర్ అయ్యారు స్వర్గీయ ఎన్టీయార్.

టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు రాముడట. అయితే, ఈ విషయంలో చాలామందికి చాలా అభ్యంతరాలున్నాయి. పోనీ, ఆ విషయాన్నీ పక్కన పెడదాం. నారా లోకేష్ మూర్ఖుడట. స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి, నమ్మి తీరాల్సిందే.

కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు తనను తాను మూర్ఖుడిగా ప్రమోట్ చేసుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంతేనా, ఒక్కొక్కరి మీదా కనీసం పన్నెండు కేసులు వుంటేనే, టీడీపీ కోసం గట్టిగా పోరాడిన నాయకుడిగా గుర్తింపునిస్తారట నారా లోకేష్. ఏదీ పైత్యం.? అనంటారా.! అదంతే.

ఒకప్పుడు కేసులున్న నాయకులంటే రాముడి లాంటి చంద్రబాబు ససేమిరా అనేవారట. కానీ, ఇప్పుడు కేసులుంటేనే గౌరవమని అంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో నారా లోకేష్ సెటైర్ వేశారనుకోవాలా.? అంతేనేమో.!

‘ఎవర్నీ వదిలిపెట్టం.. మేం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలూ తేలుస్తాం.. విదేశాలకు పారిపోయినా, పట్టుకొచ్చి బదులు చెల్లిస్తాం..’ అంటూ నారా లోకేష్ వీరావేశంగా ప్రసంగించేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో.

1995లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరిందనీ, ఆ తర్వాత ఎప్పుడూ టీడీపీ ఇక్కడ గెలవలేదనీ అదేదో ఘన చరిత్రలా చెప్పుకున్న నారా లోకేష్, ఆ చరిత్ర తిరగరాసేది టీడీపీయేనంటూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతామని సెలవిచ్చారు.

అటు వైసీపీ, ఇటు టీడీపీ.. సభ్య సమాజానికి భలే సంకేతాలిస్తున్నాయ్. హత్య కేసులు, హత్యాయత్నం కేసులు వంటివి వున్నవారే రాజకీయాల్లో గట్టిగా పనిచేస్తున్నట్టుగా భావించాలట. ఇందుకే కదా, ‘మార్పు కోసం జనసేన’ అని జనసేనాని నినదిస్తున్నది. కేసులున్నవారే రాజకీయాల్లోకి రావాలని వైసీపీ, టీడీపీ పోటీపడుతున్నాయి. స్వచ్ఛమైన యువత, మేధావి వర్గం రాజకీయాల్లోకి రావాలని జనసేన కోరుకుంటోంది. మారాల్సింది ఓటర్లే.!


Recent Random Post: