రాజకీయాల్లో బూతులు మాట్లాడితే తప్ప, ‘నాయకుడు’ అనిపించుకోవడం కష్టమని బహుశా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ భావించినట్లున్నారు. తాజాగా ఆయన వైసీపీ మీద మండిపడుతూ, ‘నీ డాష్ డాష్ సొమ్మా.?’ అంటూ బూతులు లంకించుకున్నారు. ఇదెక్కడి రాజకీయ పైత్యం. ‘మీ భాషలో చెప్పాలంటే..’ అంటూ పరోక్షంగా మంత్రి కొడాలి నాని మీద విరుచుకుపడ్డారు నారా లోకేష్.
నిజమే, మంత్రి కొడాలి నాని గతంలో చంద్రబాబుని ఉద్దేశించి, నారా లోకేష్‌ని ఉద్దేశించి బూతులు తిట్టారు.. తిడుతూనే వున్నారు. అది ఆయనకో అలవాటు. అందుకే, ‘బూతుల మంత్రి’గా ముద్ర వేయించుకున్నారు. ఫలితంగా సొంత నియోజకవర్గంలోనే కొడాలి నానికి మహిళా లోకం నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో కొన్ని పంచాయితీల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణం తన బూతుల ప్రవచనాలేనని పరోక్షంగా ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది కూడా. అలాగని ఆయన ఇకపై బూతులు మాట్లాడరనుకుంటే అది పొరపాటే.
కొడాలి నాని ఒకప్పుడు లారీ క్లీనర్‌గా పనిచేశారట. అంతమాత్రాన ఆయన బూతులు మాట్లాడటం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. మరి, నారా లోకేష్ విజ్ఞత ఏమయ్యింది.? విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించారు నారా లోకేష్. ఐటీ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా, బూతులు తిడితే రాజకీయాల్లో తమ ఉనికి నిలబడుతుందని నారా లోకేష్‌కి ఎవరు చెప్పారట.?
కృష్ణా జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో ఆమెను పరామర్శించిన నారా లోకేష్, కార్యకర్తలతో రోడ్ షో సందర్భంగా సంయమనం కోల్పోయారు. పార్టీ గుర్తు అయిన సైకిల్‌తో కూడా లోకేష్ హంగామా చేసేశారు. ఎవరో ఇచ్చిన సైకిల్‌ని అమాంతం పైకెత్తేసి.. లోకేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ నాయకుల్ని తప్పుపట్టాల్సిందేమీ వుండదు. కానీ, మాట్లాడేటప్పుడు సభ్య సమాజం ఏమనుకుంటుందో ఆలోచించుకోవాల్సిందే.
ఇంటికెళ్ళి ఆ భాషలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడగలరా.? అది కొడాలి నాని అయినా, నారా లోకేష్ అయినా.! మరి, జనాల ముందెందుకు ఆ బూతు హీరోయిజం ప్రదర్శించడం.?
Recent Random Post: