‘పోకిరి’ లక్షణాలతో నితిన్ ‘జూనియర్’

టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి నితిన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. వరుస పరాజయాలు ఎదురైనా గ్యాప్ ఇవ్వకపోవడం ఆయన కెరియర్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ మధ్య వచ్చిన ‘భీష్మ’ సినిమా తరువాత ఆయన హిట్ అనే మాట వినలేదు.

ఆ సినిమా తరువాత ఆయన చేసిన ‘చెక్’ .. ‘రంగ్ దే’ .. ‘మాస్ట్రో’ విజయానికి చాలా దూరంలో ఉండిపోయాయి. ఈ సినిమాలన్నీ ఆయనతో పాటు అభిమానులను కూడా నిరాశపరిచాయి.

ఈ నేపథ్యంలో ఆయన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మిత మవుతోంది. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాల చుట్టూ ఈ కథ తిరగనుంది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ‘రంగస్థలం’ తరహాలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుగుతుండగానే నితిన్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ఈ కొత్త ప్రాజెక్టు వక్కంతం వంశీ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

టాలీవుడ్ సినిమా రచయితలలో వక్కంతం వంశీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథలను అందించిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఒక త్రివిక్రమ్ .. కొరటాల మాదిరిగా దర్శకుడిగా మారడానికిగాను తొలి ప్రయత్నంగా ‘నా పేరు సూర్య’ సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తరువాత దర్శకుడిగా గ్యాప్ తీసుకున్న ఆయన తన రెండవ సినిమాను నితిన్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి ‘జూనియర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కథ ‘పోకిరి’ .. ‘కిక్’ తరహాలో నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుందని అంటున్నారు. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండవ సినిమా. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనీ .. ఇకపై దర్శక రచయితగానే కొనసాగాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి.


Recent Random Post: