సంచలన ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం గళం విప్పి.. భారీ సభతో తన వాదనను వినిపించిన పవన్.. తాజాగా మరో సంచలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గడిచిన కొద్ది కాలంగా అటు జాతీయస్థాయిలోనూ.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన గంజాయి వ్యవహారంపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మరో నెల వ్యవధిలో ఏపీలో రూ.4వేల కోట్ల విలువ చేసే గంజాయి పంట రాబోతుందని పేర్కొన్నారు. అలాంటిదేమీ లేదని ఏపీ సర్కారు చెబితే.. అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని.. ఒకవేళ ఉంటే అందరం కలిసే ధ్వంసం చేద్దామన్నారు. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ముందు జగన్ ప్రభుత్వం ఏపీ పోలీసులకు పూర్తి అధికారులు ఇవ్వాలన్నారు. 48 గంటల్లో కట్టడి చేసే సత్తా పోలీసులకు ఉన్నా.. అలా చేయనివ్వరన్నారు. తాజా గంజాయి సాగును అడ్డుకోకుండా మరో నెలలో దేశంలోకి రూ.4వేల కోట్ల విలువైన గంజాయి వచ్చేస్తుందన్నారు.
రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎవరు.. ఎక్కడ.. గంజాయి సాగు చేస్తున్నారన్నది కనిపెట్టలేరా? అని ప్రశ్నించారు. షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయో లేవో తెలీదని.. కానీ కేసు నమోదు చేశారని.. మరిన్ని వేల కోట్ల గంజాయి ఉన్న వేళ చట్టం ఎంత బలంగా పని చేయాలి? అని ప్రశ్నించారు. రోడ్ల దుస్థితి మీద జనసేన ఏ రీతిలో అయితే ఉద్యమించిందో అదే రీతిలో ఏపీలో గంజాయి సాగు.. స్మగ్లింగ్ మీదా జనసేన ఉద్యమిస్తుందని చెప్పారు. తాజాగా విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..
– ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో అక్రమంగా సాగవుతున్న గంజాయి తోటలు ధ్వంసం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రావాలి. అందుకు అవసరం అయితే అఖిపక్షం సాయం తీసుకోవాలి. వైసీపీ వాళ్లు రండి.. జనసేను పిలవండి.. మీ బెస్టెస్ట్ ఫ్రెండ్ టీడీపీనీ సీపీఐ సీపీఎంలను పిలవండి.. అంతా కలసికట్టుగా రూ. 4 వేల కోట్ల గంజాయి తోటలు నాశనం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకువచ్చే ప్రణాళికలు అయితే వైసీపీ ప్రభుత్వం వద్ద లేవు. గంజాయి సాగు మీద మాత్రం పట్టు ఉంది.
– మొన్న మాట్లాడితే వైసీపీ బాబులంతా నా మీద పడిపోయారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. అయితే గంజాయిని అరికట్టేందుకు వైసీపీ సర్కారు లా అండ్ ఆర్డర్ ను ఉపయోగించడం లేదు. జనసైనికుల్ని చావగొట్టడానికి ఉపయోగించే లా అండ్ ఆర్డర్ ఏఓబీలో గంజాయి సాగును అరికట్టడం మీద ఉపయోగించడం లేదు. రోడ్డుకు గుంత ఉందని మాట్లాడితే కేసులు పెడతారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో గంజాయి ఎవరు సాగు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు చెయ్యలేక కాదు వారికి చెయ్యాలన్న మనసు లేదు. అందుకే ఆ సాగులో మీకు వాటాలున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి.
– నవంబర్- డిసెంబర్ మాసాల్లో రూ. 4 వేల కోట్ల గంజాయి రవాణా జరగబోతోంది. దాన్ని ఎలా ధ్వంసం చేయాలో మీకు చేతకాకపోతే మా జనసైనికుల్ని తీసుకువెళ్లండి చేసి చూపుతారు. గంజాయి అక్రమ రవాణా అంశం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. గంజాయి సాగు ఫోటోలు తీయండి. రవాణా చేస్తున్న వారి ఫోటోలు తీయండి. తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ పోలీసులకు వాటిని ఎలా పంపాలో ఆలోచన చేద్దాం. 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అవకాశం ఇస్తే గంజాయి సాగును కట్టుదిట్టం చేయకపోతే అడగండి.
– బూతులు తిట్టిన వారి మీద పెట్టే దృష్టి గంజాయి సాగు మీద పెడితే బాగుంటుంది. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం మీరు మాకు శత్రువులు కాదు ప్రత్యర్ధులు మాత్రమే. సమస్యలపై మాత్రమే మా పోరాటం.
Recent Random Post: