నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద ఎలాంటి విమర్శలు చేశారో.. అవన్నీ, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘అది గెలుపు కాదు.. బలుపు.. బలుపు కూడా కాదు వాపు..’ అని వైసీపీ నేతలు నానా రకాల విమర్శలూ చేశారు టీడీపీ తీరు మీద. నిజమే, నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం తెలుగుదేశం ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డింది అప్పట్లో. ఓటుకి 2 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయలదాకా ఖర్చు చేసింది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
‘అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. పెన్షన్లు తీసేస్తామని భయపెట్టారు.. సంక్షేమ పథకాలు అందనీయబోమని ఇంటింటికీ వెళ్ళి మరీ బెదిరింపులకు దిగారు..’ అంటూ వైఎస్ జగన్, చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. అచ్చం అవే మాటలు, ఇప్పుడు చంద్రబాబు.. వైఎస్ జగన్ మీద ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు, విపక్షాలన్నిటిదీ దాదాపు అదే మాట. ‘చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది’ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నా, ప్రజాస్వామ్యం అప్పుడూ ఇప్పుడూ ఖూనీ అవుతున్న వైనంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కడుపు కొడతామని బెదిరించి మీరు గెలిచారు..’ అంటూ వైసీపీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం. వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి.. ఇలా ఒకరేమిటి.? చాలామంది వైసీపీ నేతలు, మునిసిపల్ ఎన్నికల వేళ… పంచాయితీ ఎన్నికల వేళ బెదిరింపులకు దిగారు.
‘మీ గ్రామంలో అభివృద్ధి జరగనీయం.. మీ వార్డుల్లో అభివృద్ధి జరగనీయం..’ అంటూ ఏకంగా ఓటరు స్లిప్పుల ద్వారా బెదిరింపులకు దిగారు వైసీపీ నేతలు. ఏ ప్రజాస్వామ్యం అయితే ఖూనీ అయిపోయిందని అప్పట్లో వైఎస్ జగన్, చంద్రబాబు మీద విరుచుకుపడ్డారో.. ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం కూడా ఖూనీ చేసేస్తోందన్న విషయాన్ని వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి హోదాలో అంగీకరిస్తారా.? లేదా.? ‘ఇది బలుపు కాదు వాపు.. జనం తిరగబడిన రోజున.. వైసీపీ అహంకారం వీగిపోవడం ఖాయం..’ అని జనసేన నేతలు చెబుతున్నారు.
Recent Random Post: