కరోనా పాండమిక్: ఔను, ఇదంతా నరేంద్ర మోడీ పుణ్యమే.!

కరోనా మొదటి వేవ్ సందర్భంగా రోజువారీ కేసులు లక్ష దాటలేదంటే.. అది ప్రధాని నరేంద్ర మోడీ ఘనతే. రెండో వేవ్ అత్యంత భయానకంగా వుంటుందనీ, రోజుకి 10 లక్షలు కేసులు నమోదయ్యే అవకాశం వుందని అధ్యయనాలు లెక్కేస్తే.. జస్ట్ నాలుగు లక్షల మార్క్ టచ్ చేసి, ఆ తర్వాత శరవేగంగా తగ్గిపోయాయంటే.. అదీ నరేంద్ర మోడీ పుణ్యమే. ఇదీ బీజేపీ చేస్తున్న ప్రచారం.

దేశంలో 20 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగిపోయిందంటే, అది నరేంద్ర మోడీ ముందు చూపు కారణంగానేనంటూ కమలనాథులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం బీభత్సంగా చేసేస్తున్నారు. ఆక్సిజన్ విషయంలో రాష్ట్రాల్ని కేంద్రమే ఆదుకుందని కూడా కమలనాథులు చెబుతున్నారు. అంతా బాగానే వుందిగానీ.. కరోనా నేపథ్యంలో చోటు చేసుకున్న మరణాల తాలూకు ఘనత ఎవరిదట.? అబ్బే, ఇలాంటి ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానాలు చెప్పరుగాక చెప్పరు.

రెండో వేవ్ గురించి ముందుగా కేంద్రం ఎందుకు అప్రమత్తమవలేదు.? రాష్ట్రాల్ని ఎందుకు హెచ్చరించలేదు.? అంటే, దానికీ కమలనాథుల దగ్గర సమాధానం దొరకదు. కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రానికి మరో రేటు, ప్రైవేటుగా కొనుక్కుంటే ఒక రేటు.. ఇలా మూడు రేట్లు వ్యాక్సిన్ విషయమై ఎందుకు.? ఈ ఘనత నరేంద్ర మోడీదేనా.? అని ప్రశ్నించినా, కమలనాథులకు నోరు పెగలదుగాక పెగలదు.

ఆక్సిజన్ అందక చాలా ప్రాణాలు పోయాయి కరోనా సెకెండ్ వేవ్ సందర్భంగా. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కరోనా బాధితుల్ని వేధిస్తోంది. మరి, దీనికెవరు బాధ్యత వహించాలి.? దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్న దరిమిలా, బీజేపీ మార్కు ప్రచారం మొదలైంది. ఇకపై ఈ ‘కాషాయ ప్రచారాన్ని’ తట్టుకోవడం దేశానికి పెద్ద తలనొప్పగా మారొచ్చుగాక. కానీ, భరించాల్సిందే.

భరించలేక.. ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘దేశద్రోహులు..’ అన్న ముద్ర ఎటూ వేసేస్తారు. అన్నట్టు, మూడో వేవ్ పొంచి వుందని హెచ్చరికలు వస్తున్నాయి. మోడీ సర్కార్, మూడోసారి ఏం చేస్తుందో.. ఎంతమందిని కరోనా మహమ్మారికి బలిపెడుతుందో.?


Recent Random Post: