ఎనిమిదేళ్ళ క్రితం నాటి వ్యవహారమది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం ఫలించిన రోజది. అదే సమయంలో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు నులిమిన సందర్భమది. దేశంలో అసలు ప్రజాస్వామ్యం వుందా.? రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందా.? అన్న అనుమానాలు కలిగిన సందర్భమది.
ఒకరికి న్యాయం చెయ్యాలంటే, ఇంకొకర్ని ఒప్పించాలిగానీ, గొంతు కోసెయ్యడమేంటి.? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, ఈ క్రమంలో విభజన తర్వాత దిక్కూ దివాణం కోల్పోయే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి.? అన్న కనీస ఇంగితం అప్పటి రాజకీయ వ్యవస్థకు లేకుండా పోయింది.
అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న ప్రశ్నకైతే సమాధానం దొరకడంలేదు. ఇంతటి దారుణానికి కారణమెవరు.? కేవలం కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో దోషిగా చూడగలమా.? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతరేశారు.. తెలంగాణలోనూ ఆ పార్టీ ‘అనుభవిస్తోంది’.!
మరి, భారతీయ జనతా పార్టీ సంగతేంటి.? తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం..’ అని ప్రకటించిన నరేంద్ర మోడీ, ప్రధాని అయ్యాక ఆ మాట మర్చిపోయారు. మాట ఇచ్చి, మడమ తిప్పిన నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ పార్టీని విభజన విషయంలో నిలదీసే నైతిక హక్కు వుందా.?
కాంగ్రెస్ అన్యాయమే చేసింది. మరి, బీజేపీ ఏం చేసింది.? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారే తప్ప, తమ అధిష్టానం.. తమను పట్టించుకోవడంలేదనీ, తమ రాష్ట్రాల్ని లెక్క చేయడంలేదనీ ఒప్పుకోగలరా.? ఛాన్సే లేదు. అదో రకం బానిసత్వం మరి.
రెండు రాష్ట్రాల్లోని తమ నాయకుల్ని ఏమార్చి, మొసలి కన్నీరు కార్చడం.. ప్రధాని నరేంద్ర మోడీకే చెల్లింది. అందుకే, మోడీజీ.. సరిలేరు మీకెవ్వరూ.! అయినా, నరేంద్ర మోడీని నిందించాల్సిన పనిలేదు. ఆయన్ని నిలదీయలేని తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్ని నిందించాలి.!
Recent Random Post: