వ్యవసాయ చట్టాలు సరైనవే.. పంటకు కనీస మద్ధతు ధర ఉంటుంది: ప్రధాని మోదీ

‘రైతులు పండించిన పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుంది. కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలి. ఇక్కడి నుంచే మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా వ్యవసాయ చట్టాలను సమర్థించారు. వ్యవసాయ మంత్రి అడిగిన ప్రశ్నలకు విపక్షాలు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టాలపై విపక్షాల తీరు హిపోక్రసీకి నిదర్శనంగా ఉందని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ గతంలో ఈ చట్టాలను సమర్థించాయని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు ఉద్యమానికి కారణాలేంటో విపక్షాలే చెప్పాలన్నారు. చట్టాలను మెరుగుపరిచేందుకు సలహాలిస్తే స్వీకరిస్తామని.. చిన్న సన్నకారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మోదీ ఉద్ఘాటించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మూలాల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. రుణమాఫీతో పేద ప్రజలకు ప్రయోజనం కలగడం లేదన్నారు. రైతులకు పెన్షన్ స్కీం పెట్టింది తామేనని.. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. పేదలకు తక్కువ ధరకు అందించే రేషన్‌ ఇకపైనా కొనసాగుతుంది. మండీలను ఆధునీకరిస్తాం.

1930లో ఏర్పాటైన మార్కెటింగ్ వ్యవస్థలోనే మనమింకా ఉన్నాం. ఫలితంగా రైతులు పంటకు ఎక్కువ రేటును పొందటం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉమ్మడి మార్కెట్‌ను తీసుకురావాలని భావిస్తున్నాం. సిక్కులు దేశానికెంతో సేవ చేశారు. వారి ముసుగులో కొందరు వారి పేరు చెడగొడుతున్నారు. రైతుల ఉద్యమంలో విద్రోహక శక్తులు కూడా ఉన్నాయనే ఉద్దేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆందోళన్‌ జీవి అనే కొత్త వైరస్‌ ప్రవేశించింది. అది దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఆందోళన చేస్తున్నారని తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి మరింత పెద్దది చేస్తోంది. దాని బారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని వ్యాఖ్యానించారు.


Recent Random Post: