బహుజన్ సమాజ్ పార్టీలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేరారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఛాలెంజ్ చేసేశారు ప్రవీణ్ కుమార్.. అదే వేదిక నుంచి.
దాంతో, సహజంగానే తెలంగాణ రాష్ట్ర సమితిలో గుబులు బయల్దేరింది. ఆ పార్టీ నుంచి పలువురు దళిత నేతలు, మీడియా ముందుకొచ్చి, ప్రవీణ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకింతలా ఉలిక్కిపడుతోంది.? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్.
తెలంగాణ రాజకీయాల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల హంగామా తక్కువేమీ కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణకి చెందిన పేర్వారం రాములు, రాజకీయంగా హల్ చల్ చేయాలనుకున్నారు. డీజీపీగా పనిచేసి రిటైరయ్యాక, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఆయనే కాదు, డీజీపీలుగా పనిచేసిన ఒకరిద్దరు ఐపీఎస్ అధికారులూ, రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా, నిలదొక్కుకోలేకపోయారు.
ఆ లెక్కన, తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రవీణ్ కుమార్‌ని చూసి ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ పోలీస్, ఓ ఎంపీని సవాల్ చేసి, రాజకీయాల్లోకొచ్చి, తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యారు. ఆయనే గోరంట్ల మాధవ్. రాజకీయాల్లో తలపండిన జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేశారు మాధవ్. అయితే, గోరంట్ల మాధవ్‌కి వైఎస్ జగన్ ఇమేజ్ ఉపయోగపడిందనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణలో బీఎస్పీ చాపకింద నీరులా విస్తరించిందన్నది జగమెరిగిన సత్యం. అయితే, అధికారంలోకి వచ్చేంత శక్తి ఆ పార్టీకి లేదు. కానీ, ఓ పార్టీ విజయావకాశాల్ని ఖచ్చితంగా దెబ్బకొట్టగలదు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి భయానికి కారణం. మరోపక్క, ‘వస్తాం, అధికారంలోకి వస్తాం.. బానిసల్లా వుండలేం.. పాలకులుగా మారతాం..’ అంటూ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రసంగం బహుజనుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంకేముంది, తెలంగాణ రాష్ట్ర సమితి గుస్సా అయ్యింది. ప్రవీణ్ కుమార్.. బీజేపీ ఏజెంట్.. అంటూ గులాబీ పార్టీ గుస్సా అయ్యింది.
ప్రవీణ్ కుమార్ మాత్రం, అధికార పార్టీని భయపెట్టగలిగినందుకు లోలోపల ఖుషీగానే కనిపిస్తున్నట్టున్నారు. ఇప్పడెంత ఖుషీగా కనిపిస్తున్నా, ఎన్నికల తర్వాత అసలు సంగతి తేలుతుంది. హుజూరాబాద్ ప్రస్తుతానికి ఆయన ముందున్న బెస్ట్ ఆప్షన్. కానీ, ఆయన అంత రిస్క్ చేసేలా కనిపించడంలేదు. చేస్తే, అదో సంచలనమే అవుతుంది.
Recent Random Post: