ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపు.. అసలేం జరిగింది చెప్మా.?

ప్రవీణ్ ప్రకాష్.. పరిచయం అక్కర్లేని పేరిది ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే, సాధారణంగా ఐఏఎస్ అధికారుల పేర్ల గురించీ, వారి వివరాల గురించీ పెద్దగా ఎవరూ పట్టించుకోరుగానీ, కొందరి విషయంలో మాత్రం ఎక్కువ హడావిడి జరుగుతుంటుంది.. అలా ఎక్కువ హడావిడి జరిగిన పేరే ప్రవీణ్ ప్రకాష్. అందుకే, జనాల్లోనూ ఆయన పేరు బాగానే మార్మోగింది గత రెండేళ్ళుగా.

జీఏడీ.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) బాధ్యతల్ని గత కొన్నాళ్ళుగా నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యమైన పనుల నిర్వహణకు సంబంధించి అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు నేరుగా ఆయనతో సంప్రదింపులు జరుపుతారన్న ప్రచారమూ లేకపోలేదు.

ఇదెంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రవీణ్ ప్రకాష్‌కి షోకాజ్ నోటీస్ ఇచ్చి, చీఫ్ సెక్రెటరీ పదవికి దూరమవ్వాల్సి వచ్చింది సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం. అదీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ అంటే. చీఫ్ సెక్రెటరీకి సమాచారం ఇవ్వకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా నిర్ణయాలు తీసుకున్నారన్నది అప్పట్లో ఎల్వీ సుబ్రమణ్యం చీఫ్ సెక్రెటరీ హోదాలో చేసిన ఆరోపణ, మోపిన అభియోగం.

నిజానికి ఎల్వీ సుబ్రమణ్యం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఐఏఎస్ అధికారి ఒకప్పుడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.. ఎల్వీ సుబ్రమణ్యంను అవమానకర రీతిలో బయటకు వైఎస్ జగన్ సర్కార్ పంపిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు వంతు ప్రవీణ్ ప్రకాష్‌ది. వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల్ని రెవెన్యూశాఖ నుంచి ఆర్థిక శాఖకు మార్చే క్రమంలో ప్రవీణ్ ప్రకాష్ సొంత నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రభుత్వ పెద్దలు గుస్సా అయ్యారట. ఈ క్రమంలోనే ఆయన్ని జీఏడీ నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ పదవిలోకి రేవు ముత్యాల రాజుని తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం.

ప్రవీణ్ ప్రకాష్ విషయమై ఎప్పటికప్పుడు వివాదాల రాజుకుంటూనే వున్నాయి. చివరికి ఇలా ఆయనపై ‘వేటు’ పడిందన్న ప్రచారం జరుగుతోంది. మరి, ఈ వ్యవహారంపై తలెత్తే రాజకీయ రచ్చ ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: