140 కోట్ల మంది భారతీయులున్న మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎందుకు తయారవలేకపోతున్నారు.? అంతర్జాతీయ పోటీల స్థాయికి ఎదిగినవారిలో కొందరు, ఆ తర్వాత దుర్భర జీవితం ఎందుకు గడపాల్సి వస్తోంది.? అలాంటివారిని చూసి, క్రీడల పట్ల ఆసక్తి మిగతావారిలో ఎందుకు చనిపోతోంది.? ఈ చర్చ చాలాకాలంగా జరుగుతూనే వుంది.
గెలిస్తే, ఆకాశానికెత్తేయడం.. ఓడితే, బండరాయికేసి కొట్టి చంపేసేంతలా నీఛత్వానికి దిగజారిపోయి విమర్శించడం.. బహుశా మనకే చెల్లిందేమో. కులం, మతం, ప్రాంతం.. ఇవన్నీ మన క్రీడల్ని, మనలోని క్రీడా స్ఫూర్తినీ చంపేస్తున్నాయి. పీవీ సింధు.. ఇప్పటిదాకా ఏ భారతీయ వనితా సాధించని అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టోక్యో ఓలింపిక్స్ సందర్భంగా. గత ఒలింపిక్ పోటీల్లో ఓ మెడల్, ఇప్పుడు ఇంకో మెడల్. భారతీయులంతా గర్వపడాల్సిన సందర్భమిది. మన తెలుగమ్మాయ్ కదా.. తెలుగు నేల పులకించాల్సిన సందర్భమిది.
కానీ, ఇక్కడే.. కొందరు ఆమె కులం గురించి శోధించేస్తున్నారు చాలా సీరియస్‌గా. గతంలో పీవీ సింధు తొలిసారిగా ఒలింపిక్ పతకాన్ని సాధించినప్పుడూ అదే పరిస్థితి. ఇప్పుడూ అదే పరిస్థితి. ఎందుకిలా.? అసలు పీవీ సింధు ఏ కులానికి చెందిన వ్యక్తి అయితేనేం.? ఆ మాత్రం ఇంగితమే వుంటే.. అసలు ఆమె కులం గురించి ఎవరైనా వెతుకుతారా.? ఛాన్సే లేదు.
నిజానికి, పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించి వుండాల్సింది ఈ సారి. టైమ్ బ్యాడ్.. ఆమె బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యలో పీవీ సింధుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. చాలామంది చాలా చాలా చెత్త కామెంట్లు చేసేశారు. సింధు ఆటతీరుని చెత్త చెత్త రాతలతో విశ్లేషించేశారు.
140 కోట్ల మంది భారతీయుల అంచనాల్ని మోసుకెళ్ళింది పీవీ సింధు. ఆమెపై ఎంత ఒత్తిడి వుంటుంది.? ఆ ఒత్తిడిని జయించడమే అతి పెద్ద సవాల్. పీవీ సింధు విషయంలోనే కాదు, ఇంతకు ముందు చాలామంది ఆటగాళ్ళ విషయంలోనూ ఇలాగే చేశారు.. ఇకపైనా అలాగే చేస్తారు.. కులం కోణంలో వారి గురించి ఆలోచిస్తారు.. మతం కోణంలో వారి గురించి పరిశోధిస్తారు.. ఏదోరకంగా లోపాల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ పనే అది.
బాక్సర్ సునీల్ కుమార్ విషయంలో అయితే, ఆయనకు తగిలిన గాయాలు, వాటి కారణంగా ఆయన మెడల్ సాధించలేకపోయిన వైనాన్ని వెల్లడించాల్సి వచ్చింది. అవును మరి, లేకపోతే.. అక్కడికేదో కావాలనే బాక్సర్ సునీల్ కుమార్ ఒలింపిక్స్ పోటీల్లో చేతులెత్తేసినట్టు విమర్శలు మొదలయ్యాయ్. కోట్లాదిమంది భారతీయులు.. తమ అభిమాన ఆటగాళ్ళ గెలుపు కోసం కాంక్షిస్తుంటారు.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వుండే కొందరు హేటర్స్.. ఇదిగో, ఇలా వెకిలితనం ప్రదర్శిస్తుంటారంతే.
Recent Random Post: