విదేశాలకు రాహుల్.. బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరుకాకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటంటూ ప్రశ్నలు కురిపించింది. వ్యక్తిగత పనుల నిమిత్తం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీతో సమావేశమైన వారం రోజుల తర్వాత రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో పలు రకాల ఊహాగానాలు చెలరేగాయి.

మరోవైపు ఢిలీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా హాజరుకాలేదు. సీనియర్ నేత ఏకే ఆంటోని జెండా ఎగురవేయగా.. ప్రియాంకాగాంధీ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ విదేశీ పర్యటనకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రియాంక సమాధానాలు దాటవేశారు. రాహుల్ రాకపోవడానికి సవాలక్ష కారణాలుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ప్రియాంకాగాంధీ ఇక్కడే ఉన్నారు కదా అని పేర్కొన్నారు.

అమ్మమ్మను చూడటానికి రాహుల్ వెళ్లారని, ఇదేమైనా తప్పా అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అవసరాలు ఉంటాయని.. ఇలాంటి అంశాల్లో బీజేపీ చవకబారు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో రాహుల్ గాంధీ ఇటలీలోని మిలాన్ వెళ్లినట్టు సమాచారం.


Recent Random Post: