ఇదేమి వైపరీత్యం: కేంద్ర బీజేపీకీ, రాష్ట్ర బీజేపీకీ సంబంధం లేదా.?

ఆంధ్రపదేశ్ రాజధానిగా అమరావతే వుండాలన్నది రాష్ట్ర బీజేపీ నిర్ణయం. కానీ, కేంద్రం మాత్రం.. రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమనీ, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని చెబుతోంది.. చెప్పడమే కాదు, ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే. రాష్ట్ర బీజేపీ, అమరావతే ఆంధ్రపదేశ్ రాజధానిగా వుండాలని తీర్మానం చేసినప్పుడు బీజేపీ అధినాయకత్వం కూడా అదే నిర్ణయానికి కట్టుబడి వుండాలి కదా. ఆ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా.? కానీ, చెప్పదు. ఎందుకంటే, రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదట.. మరీ ముఖ్యంగా రాజధాని వంటి అంశాల్లో.

ఈ కట్టు కథ, కనికట్టు కథ.. రాజధాని అమరావతికే పరిమితం కాలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం వివాదానికీ పాకింది. ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ, బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ మాత్రం, ప్రైవేటీకరణ వద్దంటోంది. ప్రజల మనోభావాల్ని గౌరవించాలంటోంది. ఇదే విషయాన్ని మా జాతీయ నాయకత్వానికి తెలియజేస్తాం. కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తాం..’ అని బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరి తాజాగా సెలవిచ్చారు. విశాఖలో బీజేపీ ముఖ్య నేతల భేటీ అనంతరం పురంధరీశ్వరి మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. అయితే, మరో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి మాత్రం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎవరూ ఆపలేరని చెబుతుండడం గమనార్హం. అదే సమయంలో బీజేపీ నేత మాధవ్, ఇప్పటికే ఈ విషయమై పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారట..

ప్రైవేటీకరణ వద్దంటూ విన్నవించారట. రాష్టానికి సంబంధించినంతవరకు బీజేపీ నేతలు ‘అపరిచితుల్లా’ వ్యవహరిస్తున్నారన్నది సాధారణ ప్రజానీకం భావన. చంద్రబాబుని పొద్దున్న లేస్తే తిడతారు.. ఆ చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు కాబట్టి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటారు. పోనీ, ఆ ప్యాకేజీ వచ్చిందా.? అంటే, దానిపైనా పెదవి విప్పరు. ఎవర్ని మోసం చేయాలని బీజేపీ చూస్తోందోగానీ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతూ.. పూటకో మాట మార్చడం బీజేపీకి తగని పని. ప్రత్యేక హోదా, అమరావతి, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా.. ఇలాంటి కీలక అంశాల్లో స్పష్టత లేకుండా పోయిన బీజేపీ, విశాఖ ఉక్కు విషయంలోనూ అదే గందరగోళం సృష్టిస్తూ, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటోందో ఏమో.!


Recent Random Post: