ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదున్న అప్పు అక్షరాలా ఆరు లక్షల కోట్ల రూపాయలట. ఇది కేంద్రం నుంచి తెప్పించుకున్న వివరాల తాలూకు సారాంశమట. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సెలవిచ్చారు. గతంలో.. అంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన అప్పులు, విభజన తర్వాత రాష్ట్రానికి మిగిలిన అప్పులు, చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, జగన్ సర్కార్ చేసిన అప్పులు.. ఇదంతా లెక్కగట్టి తేల్చిన వివరాల ప్రకారం 6 లక్షల కోట్ల అప్పు.. దానికి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ దాదాపు 42 వేల కోట్ల రూపాయలు.
రాజకీయాల సంగతి పక్కన పెడితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాంటి లెక్కలు చెప్పడంలో దిట్ట. అందుకే, ‘మార్గదర్శి’ వ్యవహారంలో రామోజీరావుని ఇరకాటంలో పెట్టేందుకు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్‌ని రంగంలోకి దించారు.
ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటున్న ఉండవల్లి, అడపా దడపా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి మీడియా ముందుకొస్తుంటారు. తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చి, అప్పుల లెక్క బయటపెట్టారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్, సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశమే లేదని తేల్చేశారు.
ఇంకేముంది, బులుగు మేధావులు రంకెలేయడం మొదలు పెట్టారు. స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి.. అంటూ ఆయన మీద విరుచుకుపడ్డం షురూ చేశారు. అంతే తప్ప, రాష్ట్రం మీదున్న అప్పు భారాన్ని ఎవరు మోస్తారన్న కనీస సోయ సదరు బులుగు మేధావులకు లేకుండా పోయింది.
నిజమే, రాష్ట్రాలు అప్పులు చేయడం మామూలే. కానీ, మరీ ఇంతలాగానా.? ఆదాయం కనిపించడంలేదుగానీ, అప్పులు పెరిగిపోతున్నాయ్. పైగా, ప్రతి సంక్షేమ పథకానికీ జగనన్న పేర్లు. ఆ సంక్షేమ పథకాల కోసం కుప్పలు తెప్పలుగా అప్పులు చేసెయ్యడం. అప్పు చేసి సంక్షేమ కూడు, పైగా దానికి సొంత పబ్లిసిటీ.
జగనన్న అప్పుల పథకం.. అంటూ కొత్త పేరు పెట్టుకుని, ప్రతి నెలా అప్పుల వివరాల్ని పత్రికల్లో ప్రకటనల రూపంలో ఇచ్చుకుని, దాన్ని కూడా ఘనతగా చెప్పుకుంటే బావుంటుందేమో. ఔను, చంద్రబాబు ప్రభుత్వమూ గతంలో అప్పులు చేసింది. అందుకే, ఓడించి మూలన కూర్చోబెట్టారు జనం. మరిప్పుడు, వైఎస్ జగన్ సర్కారు కూడా అదే కోరుకుంటోందా.? బులుగు మేధావులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.
Recent Random Post: