ప్రధాని నరేంద్ర మోడీపై విజయసాయిరెడ్డి ట్వీటు దేనికి సంకేతం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు విషయమై మోడీ సర్కారు, రాష్ట్రాన్ని సరిగ్గా చూడకపోయినా, దిశ బిల్లు అలాగే శాసన మండలి రద్దు బిల్లుకి మోడీ సర్కారు ఆమోద ముద్ర వేయకపోయినా.. మోడీ సర్కారు విషయంలో మాత్రం వైసీపీ అత్యంత ‘స్నేహపూర్వకం’గానే వ్యవహరిస్తోంది. ఎందుకిలా.?

జనసేన పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది కదా.? అంటే, అది వేరే చర్చ. బీజేపీ – జనసేన మధ్య అధికారికంగా రాజకీయ పొత్తు నడుస్తోంది. వైసీపీకి, బీజేపీతో పొత్తు లేదు కదా.? మరి, బీజేపీతో ఎందుకు వైసీపీ అంట కాగుతోంది.?

కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలో వున్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు, చెబుతూనే వున్నారు. మరి, అలాంటి మోడీ సర్కారుని కూల్చేందుకు ఎవరు పనిచేసినా, వారికి మద్దతివ్వాలి.. మద్దతివ్వకపోయినా, వ్యతిరేకించకూడదు.

కానీ, వైసీపీ చేస్తున్నది వేరు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు ప్రధాని నరేంద్ర మోడీ మీద మమకారంతో. ‘మోడీని ఓడించేందుకు టీడీపీ అనుకూల మీడియాతో కలిసి చంద్రబాబు కుట్ర పన్నారు..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేశారు.

విజయసాయిరెడ్డి, బీజేపీ నేత కాదు. మోడీపై చంద్రబాబు కుట్రల్ని తిప్పికొట్టగల నేతలు బీజేపీలో చాలామందే వున్నారు. వైసీపీ ముఖ్య నేత అయిన విజయసాయిరెడ్డి, మోడీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నట్టు.? చూస్తోంటే, బీజేపీతో అంటకాగడానికి వైసీపీ స్కెచ్ వేస్తున్నట్లుంది.

అందుకే, బీజేపీ – జనసేన మధ్య చిచ్చుపెట్టి, జనసేనను టీడీపీతో పొత్తు పెట్టుకునేలా చేసేందుకు వైసీపీ నానా తంటాలూ పడుతోందన్నమాట.

గతంలో టీడీపీ – బీజేపీ మధ్య చిచ్చుపెట్టడంలో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు బీజేపీ – జనసేన విషయంలోనూ వైసీపీ అదే లాభం పొందగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: