‘విసారె’కి జ్ఞానోదయం సరే, వైసీపీ కార్యకర్తలకెప్పడు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జ్ఞానోదయం అయ్యింది. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ‘క్షమాపణ’ చెప్పారు. అదీ రాజ్యసభ సాక్షిగానే.

‘మీరు ఒక చోట, మీ మనసు ఇంకొక చోట వుంది..’ అంటూ రాజ్యసభ ఛైర్మన్‌ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి నిన్న వివాదాస్పద వ్యాఖ్యల్ని, రాజ్యసభ సాక్షిగా చేసిన విషయం విదితమే. విజయసాయిరెడ్డి, సభ గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడారంటూ ఆయన మీద క్రమశిక్షణా చర్యలకు డిమాండ్ చేశారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయనీ, ఉప రాష్ట్రపతి పదవిలోకి వస్తూనే, తాను రాజకీయాలకు పూర్తిగా స్వస్థి చెప్పాననీ, ఏ రాజకీయ పార్టీకీ తాను అనుబంధంగా లేనని వెంకయ్యనాయుడు సభలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఇక, ఈ వ్యవహారంపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వెంకయ్యనాయుడిని చాలా తీవ్రంగా ట్రోల్ చేశారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలూ చేశారు. ‘విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేముంది.?’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ, తప్పలేదు.. స్వయానా విజయసాయిరెడ్డి.. తాను చేసిన తప్పుడు వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు.. క్షమాపణ చెప్పేశారు.

ఇకపై ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయనని సభకు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు మారాల్సింది వైసీపీ అభిమానులే. లెంపలేసుకుంటారో.. ఇంకేమన్నా చేస్తారోగానీ.. తప్పుడు పనుల్ని కూడా సమర్థించే కొందరు వైసీపీ అభిమానుల కారణంగానే ఆ పార్టీ మరింత భ్రష్టుపట్టిపోతోందన్న విమర్శలున్నాయి. ఇదిలా వుంటే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు బీజేపీ నేతలు, వెంకయ్యనాయుడిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన విషయం విదితమే.

ఢిల్లీ పెద్దలు కూడా వైసీపీ అధిష్టానానికి ఈ విషయమై అల్టిమేటం జారీ చేయడంతో.. చేసేది లేక, విజయసాయిరెడ్డి దిగొచ్చారనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైతేనేం, చేసిన తప్పుకి లెంపలేసుకుంటే.. ఇక అంతకన్నా కావాల్సిందేముంది.? ఈ జ్ఞానోదయం ఏ బలమైన కారణం వల్ల కలిగినాసరే.. సెటైర్లు పక్కన పెట్టి, బాధ్యత గుర్తెరిగితే అది విజయసాయిరెడ్డికే మంచిదన్నది రాజకీయ పరిశీలకుల భావన.


Recent Random Post: