విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్య రీతిలో’ కౌంటర్ ఇచ్చేశారు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.

కానీ, విజయసాయిరెడ్డి మాత్రం ఆగడంలేదు.. పదే పదే సోషల్ మీడియాలో ట్వీట్లేస్తూ అశోక్ గజపతిరాజుని రెచ్చగొడుతూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాలా.? ఆ అవసరమే లేదు. ఎందుకంటే, ఆయన తన హుందాతనాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.. ఇకపైనా కోల్పోరు..’ అంటూ ఆయన గురించి తెలిసినవారంతా అభిప్రాయపడుతున్నారు.

సరే, రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. ఎవరైనా, ఎంతటివారినైనా హీనాతి హీనంగా విమర్శించేయొచ్చనుకుంటారు. ఇప్పుడున్న రాజకీయాల్లో పాతికేళ్ళు కూడా లేని ఓ కార్యకర్త, ఓ ముఖ్యమంత్రినో.. ప్రధాన మంత్రినో నోటికొచ్చినట్లు తిట్టడం అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఓ స్థాయి వ్యక్తులు తమ స్థాయిని దిగజార్చేసుకుంటే.. అదే స్థాయికి అవతలి వ్యక్తులూ దిగజారుతారా.? లేదా.? అన్నదే చర్చ ఇక్కడ.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలకు సంబంధించి వైసీపీ ముఖ్య నేతలు వివిధ మార్గాల్లో అధికారికంగానే ఆరా తీశారట. ఆ విషయాల్ని నిన్నే అశోక్ గజపతిరాజు బయటపెట్టారు. మరి, అలా ఆరాలు తీశాక.. అందులో తేటతెల్లమైన నిజాలేంటి.? అన్నది అశోక్ గజపతిరాజు ప్రశ్న. అయితే, ఆయనెక్కడా ఎవర్నీ తూలనాడటంలేదు. అది ఆయన హుందాతనం.

విజయసాయిరెడ్డి అలా కాదు.. ఆయన తీరు వేరే. రెచ్చగొట్టడం.. పదిమందితో తిట్టించుకోవడం తనకు అలవాటన్నట్టుగా వుంటుంది సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లేసే తీరు. చిత్రమేంటంటే, విజయసాయిరెడ్డి.. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు నిందితుడిగా వున్నారు. దాంతో, విజయసాయిరెడ్డి మీద ఎవరు గట్టిగా తిట్ల వర్షం కురిసించినా.. అది సమాంతరంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ వర్తిస్తుందనేలా తయారైంది పరిస్థితి. కానీ, విజయసాయిరెడ్డి మాత్రం తన వల్ల తమ పార్టీ అధినేతకు డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

6 నెలలు జైల్లో వుండొచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనపడతారు.. అని అశోక్ గజపతిరాజు చేసిన కామెంట్, విసారెడ్డికీ, జగన్ మోహన్ రెడ్డికీ వర్తిస్తుందన్నది సోషల్ మీడియాలో మెజార్టీ నెటిజన్ల మాట.


Recent Random Post: