విసారె ట్వీటోత్పాతం: బాబు మీదేనా.? దొర మీద నోరు పెగలదేం.?

‘తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.1 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ.’ అంటూ ట్వీటేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

మరో ట్వీటులో ‘అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్ళు అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకంతోపాటు జగన్ గారు మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడు రైతు ద్రోహి..’ అంటూ విరుచుకుపడిపోయారు. అమరావతి స్కాం నుంచి చంద్రబాబు తప్పించుకోలేరంటూ మరో ట్వటీశారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

అంతా బాగానే వుందిగానీ, చంద్రబాబు మీద విరుచుకుపడ్డంలో బాగానే పనిచేస్తోన్న విసారె ప్రతిభ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని నిలదీయడంలో ఎందుకు వెలవెలబోతున్నట్లు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నర రూప రాక్షసుడిగా తెలంగాణ మంత్రులు అభివర్ణిస్తున్నారు. అంతేనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గజ దొంగ.. అంటున్నారు. పార్టీ అధినేతని తిట్టినా.. పార్టీ జెండాలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినా.. పాపం విసారెకి పౌరుషం రావడంలేదాయె.

ప్రస్తుతం ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటోన్న అతి పెద్ద సమస్య, తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టుల నుంచి నీటిని విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కిందికి వదిలేయడం.. ఆ నీరు సముద్రంలో కలుస్తుండడం. ఇప్పటికే వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది. కానీ, విజయసాయిరెడ్డికి తెలంగాణపై విరుచుకుపడేంత సీన్ లేదు. ఈ విషయంలో విసారెకి నోరు పెగలదు. అంతేనా, ట్విట్టర్‌లో షరామామూలుగా వేసే రెట్టలు వేయడానికీ వీల్లేదు. వేస్తే ఏమవుతుందో విజయసాయిరెడ్డికి బాగా తెలుసు.

చంద్రబాబుని తిట్టడమంటే, దీన్ని కేవలం డైవర్షన్ రాజకీయంగానే భావించాలి. రెండేళ్ళుగా చంద్రబాబునాయుడిని కాపాడుతున్నదెవరు.. వైసీపీనే కదా.? లక్షల కోట్ల కుంభకోణమంటూ అమరావతి గురించి వైసీపీ ఆరోపిస్తోంది. ఏదీ, ఒక్క పైసా అయినా వెనక్కి రప్పించగలిగారా.? చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ, విజయసాయిరెడ్డినీ.. టీడీపీ ప్రభుత్వం కాపాడింది.. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోంది చంద్రబాబు విషయంలో. ఆ స్నేహంతోనే.. ఇదిగో ఇలాంటి డైవర్షన్ రెట్టోత్పాతాలు.. అదేనండీ ట్వీట్లు పడుతున్నాయన్నమాట.


Recent Random Post: