ఇంటి పునాదులు వేరు.. ప్రాజెక్టుల పునాదులు వేరు. పునాదులు దాటి ప్రాజెక్టు పైకి కనిపించాలంటే అది మహా యజ్ఞమే. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయి. అయితే, నత్త నడకన సాగాయి. వైఎస్ జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో చాన్నాళ్ళు పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చంద్రబాబు హయాంలో పునాదులు దాటి, ప్రాజెక్టు పనులు పైకొస్తే, వాటికిప్పుడు వైఎస్ జగన్ సర్కార్ వడివడిగా మెరుగులు దిద్దేస్తోంది.
తాజాగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ అధికార పార్టీ ‘భజన’ షురూ చేసింది. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవ పరిస్థితి ఏంటి.? ఇది మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా చెప్పదుగాక చెప్పదు.
పోలవరం ప్రాజెక్టు కోసం తాజా అంచనాల ప్రకారం 50 వేల కోట్ల పైనే ఖచ్చవుతుంది. మరి, ఆ స్థాయిలో కేంద్రం నిధులు ఇచ్చిందా.? ఇవ్వబోతోందా.? అంటే, లేదనే చెప్పాలి. తాజాగా కేంద్రం రాష్ట్రానికి కొన్ని నిధుల్ని రీ-ఎంబర్స్ చేసింది. అంటే, రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల్ని, కేంద్రం రాష్ట్రం అకౌంట్‌లోకి జమ చేసిందన్నమాట.
జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్రమే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలి. కానీ, రాష్ట్రం ఖర్చు చేశాక.. ఆ లెక్కలు పట్టుకుని ఢిల్లీకి పరిగెడితే, ఒకటికి పదిసార్లు అడుక్కుంటే తప్ప, కేంద్రం నిధులు ఇవ్వడంలేదు. పైగా, ఇచ్చే నిధులు కూడా ‘బిచ్చం’ తరహాలోనే కనిపిస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
సుమారు 50 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయానికి గతంలో కేంద్రం ఆమోదం పలికినా, ఆ తర్వాత కొర్రీలు వేసింది.. దాదాపు 25 వేల కోట్ల రూపాయల విషయంలో పంచాయితీ నడుస్తోంది. రాష్ట్రం బతిమాలుతోంది, కేంద్రం ఇప్పుడు ససేమిరా అంటోంది. సరిగ్గా ఈ సమయంలో ‘బాకీలు’ విడుదల చేసింది కేంద్రం. ఆ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం యాత్ర పెట్టారు. దీనర్థమేంటి.? జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్ వెనుక రాజకీయ ప్రయోజనమేంటి.?
ఒక్కటి మాత్రం నిజం.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పైకి బాగానే కనిపిస్తోంది. దాంతో, ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలోనే సందేహం. ఆ నిధులు ఇవ్వకపోతే, పోలవరం ప్రాజెక్టు అనేది ఓ కట్టడంగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.
Recent Random Post: