జగన్ మోహనా… నీపై మోజు తీరిపోయేనా… ?

ఈ ప్రపంచంలో ప్రతీ దానికీ ఎక్స్ పైర్ డేట్ ఉంటుంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఈ భూగోళానికి సూర్య చంద్రులకు కూడా ఏదో రోజున లాస్ట్ డే అనేది ఉంటుంది. అని పరిశోధకులు చెబుతారు. . ఇక నాయకులు అన్న వారు వెండి తెర మీద అయినా రాజకీయ తెర మీద అయినా జనాలకు బాగా మోజు ఉన్నపుడే బాగుంటారు. అది ఏ మాత్రం తగ్గినా తీరినా ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. అపుడు జనాల మూడ్ మాటలతో పాటు చేతలలో సైతం కనిపిస్తుంది.

జగన్ అంతటి ప్రజాకర్షణ నాయకుడి విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా అంటే ముందే చెప్పుకున్నట్లుగా జరుగుతుందేమో. ఎందుకంటే జనాదరణకు కొలమానం లేదు అది తగ్గవచ్చు పెరగవచ్చు. ఇక జగన్ అన్న మూడక్షరాలు ఒకనాడు ఏపీ జనాలను ఊపేశాయి.

అత్యంత ప్రజాకర్షణ నాయకుడిగా జగన్ ఏపీ రాజకీయాలలో అనతికాలంలో చోటు సంపాదించుకున్నారు. ఆయన గ్లామర్ ఒక దశలో సినిమా స్టార్స్ తో పోటీ పడింది. వారిని మించి కూడా సాగింది. జగన్ పాదయాత్రను ఏణ్ణర్ధం పాటు చేశారు. నాడు జగన్ ఏం చెప్పినా జనాలు ఆసక్తిగా విన్నారు. నిజానికి అప్పట్లో జగన్ దాదాపుగా చెప్పిన విషయాలనే ప్రతీ చోటా చెబుతూ రోటీన్ స్పీచులే ఇచ్చారు.

అయినా జనాలు ఆయనకు నీరాజనాలు పట్టారు అంటే అది వైసీపీ మీద మోజు జగన్ మీద తరగని అభిమానం అనుకోవాలి. ఇక జగన్ మూడేళ్ళుగా సీఎం గా ఉన్నారు. పైగా ఆయన చంద్రబాబు మాదిరిగా ఎక్కడా పెద్దగా తిరిగిందీ లేదు ఈ మధ్యనే జిల్లాల టూర్లు స్టార్ట్ చేశారు.

ఇపుడిపుడే రాజకీయంగా గేర్ మార్చుతోంది వైసీపీ. అలాంటిది జగన్ స్పీచ్ ఇస్తూంటే జనాలు వెళ్ళిపోవడమా. నిజంగా ఇది ఆశ్చర్యంతో కూడుకున్న విషయమే. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా కార్యక్రమంలో జగన్ ఒక వైపు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూండంగానే మహిళలు అంతా పెద్ద ఎత్తున సభ నుంచి వెళ్ళిపోవడం వారిని కూర్చోబెట్టడానికి పోలీసులు పడిన పాట్లు అన్నీ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి.

నిజంగా ఇది షాకింగ్ పరిణామమే. ఎండవేడిమి తాళలేకనో లేక అప్పటికి కొన్ని గంటల బట్టి సభలో ఉండడం వల్లనో జనాలు వెళ్ళిపోయారు అనుకుంటే ఓకే. కానీ వారు జగన్ స్పీచ్ ని వినేందుకు ఆసక్తిగా లేక వెళ్ళిపోతున్నారు అన్నదే నిజమైతే మాత్రం వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగినట్లే.

ఎందుకంటే వైసీపీకి ఏకైక స్టార్ కాంపెనియర్ జగన్ అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సభలకే జనాలు హాజరు కాకపోతే వచ్చిన వారు మధ్యలో వెళ్లిపోతే మాత్రం అది వైసీపీ విజయావకాశాల మీదనే పెను ప్రభావం చూపిస్తుంది. ఇక మూడేళ్ళ పాలన మాత్రమే పూర్తి అయింది. ఇంకా రెండేళ్ళు పాలన ఉంది.

ఎన్నికల వేళ అయితే జనాలు అప్పటికి ఒక అభిప్రాయానికి వస్తారు కాబట్టి ఇలా సభ మధ్యలో వెళ్ళిపోవడం అన్న సీన్లు తరచుగా కనిపిస్తాయి. కానీ ఎపుడూ కిక్కిరిసిపోయే జనాలతో సభలను చేసే జగన్ స్పీచ్ వద్దు అని మహిళలు వెళ్తున్నారు అంటే అసలు విషయం ఏదో వైసీపీ తెలుసుకోవాలి. దాన్ని పక్కాగా సరిదిద్దుకోవాలి.

ఏది ఏమైనా ఇక్కడ ఒక్క మాట. జగన్ తో సహా రాజకీయ నాయకులు అంతా తమ రొటీన్ స్పీచ్ లను కూడా మార్చుకోవాలి. వీలైనంత ఆహ్లదంగా ఉండేలా చూసుకోవాలి. తమకు నచ్చిన తీరున ప్రసంగాలు తాము చేస్తున్నామని అనుకోకుండా జనాలు వినేలా జనరంజకంగా ఉంటున్నాయా లేవా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రజలకు అనేక రకాలైన ఆప్షన్లు పిలుస్తున్నాయి. వారిని సభల పేరిట కట్టి పడేసి రొడ్డకొట్టుడు స్పీచ్ లను వినిపిస్తామంటే ఏ జనమూ ఏ నాయకుని ముందూ ఆగే సీన్ అయితే ఈ రోజుకు లేదు. ఇదే అందరూ గుర్తించాల్సిన విషయం.


Recent Random Post: