ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అన్న చందాన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, ఆయా విషయాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడం, ‘చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి’ అంటూ వైసీపీ శ్రేణులు చెప్పడం, రాష్ట్రానికి సంబంధించిన ఏ కీలక అంశమూ ఒక్క అడుగు కూడా ముందుకు కదలకపోవడం మామూలే అయిపోయింది.
ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ అసలే లేదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్పష్టత లేదు. వెనుక బడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల సోయ కూడా లేదు. అయిననూ, హస్తినకు పోవాల్సిందే.. హస్తిన పెద్దలను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
రాష్ట్ర ప్రభుత్వం, శాసన మండలి రద్దుకి సిఫార్సు చేస్తూ కేంద్రానికి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పంపితే, ఇప్పటిదాకా ఆ విషయమై కేంద్రం నుంచి స్పందనే లేదు. దిశ చట్టం వ్యవహారమేమయ్యిందో చూశాం.. మరికొన్ని బిల్లులు కూడా ఇలాగే కేంద్రం పరిశీలనలో ఆగిపోయాయి. ఇక, ఇప్పుడు 3 క్యాపిటల్స్ విషయమై కేంద్రం నుంచి ‘తీపి కబురు’ అందుకోవాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ లక్ష్యమట.
కేంద్రం ఎలాగూ, 3 రాజధానులు రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది గనుక, ఆ 3 క్యాపిటల్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరనున్నారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కరుణిస్తారా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. అన్నట్టు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ముహూర్తం ఖరారు కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీకి వెళ్ళి పలు కీలక అంశాల్ని కేంద్రం వద్ద ప్రస్తావించారు. అందులో ఏపీతో ప్రాజెక్టుల పంచాయితీ అంశం కూడా వుంది. మరి, ఇప్పుడు వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌లో ఆ అంశాలూ చర్చకు వస్తాయా.? ఏమో, వేచి చూడాల్సిందే. కొసమెరుపేంటంటే, 3 క్యాపిటల్స్ అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం తేల్చేశాక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్‌కి ఒకటే రాజధాని.. అదే అమరావతి.. ఇదే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం.. అని ప్రకటించడం. ఇంతలోనే, వైఎస్ జగన్ ఢిల్లీ యాత్ర ఖరారవడం కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా మారింది కదూ.!
Recent Random Post: