ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

‘ఆంధ్రప్రదేశ్‌ లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందా.? లేదా.? అన్న విషయాన్ని తేల్చుతాం’ అంటూ హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెల్సిందే. ఇది రెండు వ్యవస్థల మధ్య పోరాటంగా తయారైంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, వారిని అడ్డగోలుగా అరెస్ట్‌ చేసేస్తున్నారనీ, రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడంలేదనీ హైకోర్టు పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన విషయం విదితమే.

ఎన్నిసార్లు చెప్పినా, ప్రభుత్వ తీరు మారడంలేదంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం, ఈ క్రమంలో పలు పిటిషన్ల విచారణ సందర్భంగా రాజ్యాంగ ఉల్లంఘన అంశం తెరపైకి రావడం, ఆ దిశగా విచారణ చేపడ్తామని హైకోర్టు తేల్చి చెప్పడం తెలిసిన విషయాలే. ఇక, హైకోర్టు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ‘రాజ్యాంగ ఉల్లంఘన’ అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సర్వోన్నత న్యాయస్థానం.

అంతే కాదు, హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌, రాజ్యాంగ ఉల్లంఘన అంటూ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యలు అందోళనకరంగా వున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా.?’ అంటూ న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని వ్యతిరేకించిన న్యాయవాది లూథ్రాని నిలదీసింది. తదుపరి విచారణను శీతాకాల సెలవుల తర్వాత చేపడ్తామని పేర్కొంది న్యాయస్థానం.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణకు అనుమతించాలని న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోరినా, సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం. రాత్రికి రాత్రి పోలీసులు, ఆయా కేసుల్లో నిందితలంటూ పౌరుల్ని ఎత్తుకెళుతున్నారనీ, హైకోర్టు లో ఆయా ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు అందాకనే అరెస్టులు చూపిస్తున్నారని ఆరోపిస్తూ పలు కేసులు హైకోర్టులో నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థకు పలుమార్లు మొట్టికాయలేసింది రాష్ట్ర హైకోర్టు. అయితే, ఈ వ్యవహారంలో ఇన్నాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట దక్కడం గమనార్హం.


Recent Random Post: