తెలుగునాట కనీ వినీ ఎరుగనిస్థాయిలో బంపర్ విక్టరీ సొంతం చేసుకుంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ‘ల్యాండ్ స్లైడ్ విక్టరీ’ కొట్టాక, గడచిన ఏడాదిన్నర కాలంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏం చేశారు.? ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు, పరిపాలన చేస్తున్నారా.? మాట తప్పి, మడమ తిప్పి.. తానూ సగటు రాజకీయ నాయకుడినేనని, తానూ సగటు రాజకీయ పార్టీనే నడుపుతున్నానని నిరూపించుకుంటున్నారా.?
నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ, ఆ వైసీపీ శ్రేణులు సైతం, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కరోనా నేపథ్యంలోనూ అత్యద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. అయితే, వీటిల్లో చాలావరకు ‘పబ్లిసిటీ కార్యక్రమాలే’ అవుతుండడం గమనార్హం.
‘మా ముఖ్యమంత్రికి పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకునేంత పబ్లిసిటీ పైత్యం లేదు..’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్‌లో హల్‌చల్ చేశారు. కానీ, జరుగుతున్నదేంటి? చెప్పే మాటలకీ, చేస్తున్న చేతలకీ అస్సలు పొంతన వుండడంలేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచేస్తామని నినదించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక.. కేంద్రానికి సాగిలాపడిపోయింది. ‘వాళ్ళకి ఇచ్చే ఉద్దేశ్యం లేదు.. మేం మాత్రం ఇచ్చేదాకా అడుగుతూనే వుంటాం..’ అని చెబుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
పార్టీ ఫిరాయింపులపై వైఎస్ జగన్ ఏం చెప్పారు.? ఏం చేస్తున్నారు.? టీడీపీ నుంచి, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చేసుకున్నారు.. వారి వారసులకు వైసీపీ కండువాలు కప్పారు. ‘పార్టీ మారగానే పదవి పోవాల్సిందే..’ అన్న వైఎస్ జగన్, ఎవరి పదవి ఊడగొట్టారు.? ఊడగట్టలేనంత నిస్సత్తువ ఎందుకు ఆయన్ని ఆవరించింది.? ఏ భయం ఆయన్ని అలా ఆపుతోంది.? ఏమో, వైఎస్ జగన్‌కే తెలియాలి.
సంక్షేమ పథకాలు సరే, అభివృద్ధి మాటేమిటి.? రాష్ట్రంలో గడచిన ఏడాదిన్నరగా అభివృద్ధి.. అన్న మాటకు చోటు లేకుండా పోయింది. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో వుంది. కనీసం, అమరావతినైనా అభివృద్ధి చేయొచ్చు కదా.? అంటే, అసలు రాజధాని అమరావతి తమకు సంబంధం లేని వ్యవహారం.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.
గతంలో అమరావతికి మద్దతిచ్చి, ఇప్పుడు అమరావతి విషయంలో ‘యూ టర్న్’ తీసుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఎలా చూసుకున్నా.. ప్రజలిచ్చిన విజయాన్ని అవమానపర్చుతోంది వైఎస్ జగన్ సర్కార్. ఇంతటి విజయం భవిష్యత్తులో ఇంకో రాజకీయ నాయకుడికి దక్కుతుందని అనుకోలేం. ఎందుకంటే, ఇకపై ప్రజలు.. ఏ రాజకీయ పార్టీకీ ఇంత మెజార్టీ ఇవ్వబోరు. ఇస్తే ఏమయ్యిందో.. వాళ్ళకే తెలుస్తోంది. రోడ్డెక్కితే.. నడుములు విరిగిపోతున్నాయ్.. ఆ స్థాయిలో రోడ్లు సర్వనాశనమైపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు.. ఇంకోపక్క పన్నులు, ఛార్జీలు పెంచేసి.. జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. ఇదేం పాలన మహాప్రభో.? అని జనం వెక్కి వెక్కి ఏడ్చే దుస్థితిని తీసుకొచ్చింది వైసీపీ.
Recent Random Post: