ఖైదీ నెంబర్‌ 6093: ఓ న్యాయమూర్తి ఆవేదన ఇది.!

తెరపైకి మళ్ళీ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ప్రస్తావన వచ్చింది. అదీ, ఓ ప్రముఖ న్యాయమూర్తి తన తీర్పు సందర్భంగా ఆ ‘ప్రస్తావన’ చేశారు. ఆ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ఇంకోవరో కాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ కొన్నాళ్ళ క్రితం అరెస్టయి, జైల్లో వున్నప్పుడు ఆయనకు జైలు అధికారులు కేటాయించిన నెంబర్‌ 6093. ఖైదీ నెంబర్‌ 6093 అని గూగుల్‌ సెర్చ్‌లో టైప్‌ చేస్తే, చాలా సమాచారం లభిస్తుందని ఎవరో చెబితే, తాను అలా చేశాననీ, తద్వారా తాను తెలుసుకున్న సమాచారంతోపాటు, కొంత సాధికార సమాచారాన్ని సేకరించానని సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరికొందరు న్యాయమూర్తులపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫిర్యాదు తర్వాత చాలా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయనీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆయాచిత లబ్ది ఆ కారణంగా జరిగిందనీ న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యానించడం అటు న్యాయ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెను ప్రకంపనలు రేగుతున్నాయి.

రాజకీయాల్లో వున్న నేర చరితుల విషయమై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, రాష్ట్రంలోని పోలీసు శాఖ.. ముఖ్యమంత్రిపై అప్పటికే వున్న చాలా కేసుల్ని పలు కారణాలు చూపి మూసేశారంటూ న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన విషయం.

జగన్‌పై 2011 నుంచీ పెండింగ్‌లో వున్న చాలా కేసుల్లో ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాకపోవడం వ్యవస్థపై గొడ్డలి పెట్టు.. అని రాకేష్‌ కుమార్‌ ప్రస్తావించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

పదవీ విరమణకు ముందు తనను తీవ్రంగా అవమానపరిచేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని రాకేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసులో తుది విచారణ ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తరఫున పిటిషన్‌ దాఖలవడం, డివిజన్‌ బెంచ్‌ సభ్యుడిగా వున్న న్యాయమూర్తిపై ఐఏఎస్‌ అదికారి క్రూరమైన ఆరోపణలు చేయడం.. ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరిగినవేనన్నది న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌ తీర్పులోని కొన్ని కీలకమైన అంశాలు.

ఇదే రాకేష్‌కుమార్‌, విచారణ బెంచ్‌ నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. న్యాయస్థానాలపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఓ ఎంపీపై సాక్షాత్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేసినా కేసులు పెట్టలేని ప్రభుత్వ అసమర్థతనీ జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఎండగట్టారు.

అయితే, న్యాయమూర్తులపైనా, న్యాయ వ్యవస్థపైనా ఇప్పటికే అవాకులు చెవాకులు పేలుతోన్న అధికార పార్టీకి, ఈ అక్షింతలు అంతగా ఇబ్బంది కలిగించేవి కావు. పైగా, ‘మేం చెప్పాం కదా, మాకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని.. దానికి రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యలే నిదర్శనం..’ అని అధికార పార్టీ వక్రభాష్యం చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


Recent Random Post: