వైఎస్ జగన్ మండలి రాజకీయం: చెప్పేదొకటి, చేసేదింకొకటి.!

రాజకీయ నాయకులకు రెండు నాల్కలేం ఖర్మ.. వెయ్యి నాలికలు వుంటాయేమో. లేకపోతే, చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ సంబంధం లేకపోయినా, ప్రజల్ని మభ్యపెడుతూనే వుంటారు. కార్యకర్తలు వెర్రి వెంగళప్పల్లా.. ‘ఏం మాట్లాడుతున్నాడు రా మన నాయకుడు..’ అనుకుంటారు తప్ప, నాయకుడు మాట్లాడేది నిజమా.? కాదా.? అని మాత్రం ఆలోచించరు. ఫలానా నాయకుడు.. అని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు.. రాజకీయాల్లో నూటికి 99 శాతం మంది నాయకులు ఇలాగే వుంటారు. చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైనా ఒకటే.

శాసనమండలి విషయానికే వద్దాం. శాసన మండలిని రద్దు చేయాలన్నది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) నినాదం. ఈ మేరకు అసెంబ్లీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ప్రసంగం కూడా చేసేశారు. శాసన మండలి అనేది ఖర్చు దండగ వ్యవహారమని ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలంతా తేల్చేశారు. శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపించేశారు కూడా. కానీ, కేంద్రంపై ఈ విషయమై ఒత్తిడి తీసుకురావడంలేదు.

ఇంకోపక్క, మండలిలో సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్తవారికి అవకాశాలొస్తున్నాయి.. ఈ మేరకు అధికార పార్టీ ‘నియామకాలు’ జోరుగా చేపడుతోంది. ‘ఖాళీల్ని పూరించాల్సిందే కదా..’ అని వైసీపీ చెప్పుకోవచ్చుగాక. కానీ, అసెంబ్లీలో శాసన మండలి విషయమై ఏం మాట్లాడారు.? ఇప్పుడు ఏం చేస్తున్నారు.? ఖర్చుదండగ వ్యవహారానికి.. ఇంత హైడ్రామా అవసరమా.? పైగా, ‘మాటకు కట్టుబడి.. విధేయతకు పట్టంకట్టి..’ అంటూ కొత్తగా ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వడం గురించి వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది అధికార పార్టీ తీరు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ఎటూ శ్రద్ధ లేదు.. కనీసం, ‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అని జగన్ గురించి గట్టిగా చెప్పుకుంటున్నారు కాబట్టి, శాసన మండలి లాంటి విషయాల్లో అయినా తమ ‘చిత్తశుద్ధి’ని వైసీపీ నిరూపించుకోవాలి కదా.!


Recent Random Post: