ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రికి ప్రభుత్వం నుంచి అందుతోన్న గౌరవ వేతనం ఎంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘మా ముఖ్యమంత్రి చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టకుని రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటున్నారు..’ అని చెబుతుంటారు వైసీపీ నేతలు. అదే నిజమైతే, ఏడాదికి ఆదాయపు పన్ను కింద ఏడు లక్షల పధ్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు.. అనగా 7,14,924 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నట్లు.? అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తుండడం గమనార్హం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే మంత్రి పేర్ని నానికి సంబంధించి ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాల్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మంత్రిగారి లెక్క 2,91,096 రూపాయలు.. అనగా అక్షరాలా రెండు లక్షల తొంభై ఒక వేల తొంభై ఆరు రూపాయలు. మిగతా మంత్రులకు సంబంధించి జరుగుతున్న చెల్లింపులెంత.? అన్నది తేలాల్సి వుంది.
ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది గనుక, ఆదాయపు పన్ను కూడా ప్రభుత్వమే కడుతుందా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాల్ని అధికారికంగానే పేర్కొన్నారనుకోండి.. అది వేరే సంగతి. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయతను దెబ్బతీస్తోందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టకుని ముఖ్యమంత్రి అసలు వేతనమే తీసుకోవడంలేదనీ, రూపాయితో సరిపెడుతున్నారనీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. ఆ లెక్కన వేతనం 12 రూపాయలే అయితే, ఏడు లక్షలు ఎందుకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వచ్చిందట.?
ఇదిలా వుంటే, అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు దుబారా చేశారంటూ విమర్శలు చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక.. అంతకు మించి దుబారా చేస్తోందా.? అంటే, అవుననే చర్చ సర్వత్రా జరుగుతోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, క్యాంప్ కార్యాలయ నిర్వహణ సంబంధ వ్యవహారాలు, సలహాదారులు.. ఇవన్నీ చూసుకుంటే, చంద్రబాబుని మించి వైఎస్ జగన్ వృధా ఖర్చు చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల విమర్శ. మరి, అధికార వైసీపీ ఈ విమర్శలకు ఏం సమాధానమిస్తుందో.!
Recent Random Post: