సీజేఐ ఎన్వీ రమణకు జగన్ శుభాకాంక్షలు.. వాళ్ళ పరిస్థితేంటి.?

రాజకీయాలన్నాక చాలా వుంటాయ్. వాటిని పట్టుకుని వెర్రి వెంగళప్పలవడం ఆయా రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు కొత్తేమీ కాదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కొన్నాళ్ళ క్రితం నూతలపాటి వెంకటరమణ అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం. జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్రమైన ఆరోపణలే చేశారు వైఎస్ జగన్.

ఆ ఆరోపణల్ని పట్టుకుని, వైసీపీ నేతలు అలాగే ఆ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు, జస్టిస్ ఎన్వీ రమణని విమర్శించడానికి. కులాన్ని ఆపాదించారు.. ఇంకేవేవో చేసేశారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణల్లో అర్థమే లేదని తేలిపోయింది.. జస్టిస్ ఎన్వీ రమణ, ఈ వ్యవహారంలో క్లీన్ చిట్ పొందారు. అంతేనా, జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. అయ్యారు.

కొత్త సీజేఐ ఎన్వీ రమణ కీర్తి ప్రతిష్టల్ని కొనియాడుతూ పలువురు ప్రముఖులు ఆయనపై శుభాకాంక్షల వర్షం కురిపించేస్తున్నారు. మరి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు.? చేయబోతున్నరు కాదు.. చేసేశారు. ఇంకేం చేస్తారు.? పద్ధతి ప్రకారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. దాంతో, ఇప్పటిదాకా ఎన్వీ రమణపై సోషల్ మీడియా వేదికగా బుదర చల్లిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

‘ఆయనకు మీరు శుభాకాంక్షలు చెప్పడమేంటన్నా..’ అంటూ సోషల్ మీడియా వేదికగానే జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. పాపం వైసీపీ కార్యకర్తలు.. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదేమో.

కొత్త చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో వైఎస్ జగన్.. ముందు చూపుతోనే ఇలా వ్యవహరిస్తున్నారా.? వైఎస్ జగన్ మారిన మనిషి.. అని అనుకోవాలా.? గతంలో ఎన్వీ రమణ మీద తాను చేసిన ఆరోపణలు అసత్యమని, స్వయానా జగన్ ఇప్పుడు అంగీకరించినట్లేనా.? ఏమో, ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.. సమాధానం చెప్పాల్సింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.


Recent Random Post: