రుయా ఆస్పత్రిలో మృతులకు రూ.10 లక్షల పరిహారం

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మన చేతుల్లో లేని కొన్ని అంశాలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారన్నారు. సోమవారం 6 ట్యాంకర్లను విమానంలో ఒడిశాకు పంపామని, రవాణా సమయాన్ని తగ్గించడానికి వాటిని ఎయిర్ లిఫ్ట్ చేశామని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి ఓడల ద్వారా తెప్పిస్తున్నట్టు వెల్లడించారు.

ఆక్సిజన్ కొరత రాకుండా అన్న రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నా.. బాధాకర ఘటనలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన ఎక్కడా జరగకుండా చూడాలన్నారు. రుయా ఘటనలో మన తప్పు లేకపోయినా బాధ్యత వహించాలని.. ఆ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఇక వ్యాక్సిన్ల విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. 22 నెలల్లో రూ.87వేల కోట్లు పేదల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతుందా అని ప్రశ్నించారు.


Recent Random Post: