వైఎస్ జగన్‌లో ఈ మార్పు దేనికి సంకేతం.?

దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం తీరుని తప్పుపడుతున్నారు. వ్యాక్సినేషన్ వ్యవహారం మొత్తాన్నీ కేంద్రం తన కనుసన్నల్లో నడిపిస్తోంది. రాష్ట్రాలకు టీకాల కేటాయింపుల దగ్గర్నుంచి, విదేశాల్లో తయారయ్యే టీకాలను దేశంలోకి తీసుకొచ్చే విషయంలోనూ కేంద్రమే కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్రం బాధ్యత తీసుకోవడం మంచిదే. కానీ, రాష్ట్రాలకు తగిన స్థాయిలో వ్యాక్సిన్లు అందడంలేదు. కావాలంటే, గ్లోబల్ టెండర్లకు వెళ్ళండంటూ కేంద్రం ఇప్పటికే తన బాధ్యతల నుంచి తప్పుకుంది.

కానీ, రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు సిద్ధమైనా, కేంద్రం ఆమోద ముద్ర వేయడంలేదు. దాంతో, వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా తప్పుపట్టాల్సి వస్తోంది. కాస్త లేటుగా విషయం అర్థమయ్యిందేమో, నలుగురితో నారాయణ.. అన్నట్టు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ, సుద్దులు చెప్పారు.

వ్యాక్సినేషన్ విషయమై రాష్ట్రాలన్నీ ఒకే తాటిపై వుండి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉవాచ. కరోనా విషయంలో కేంద్రం తీరు సరిగ్గా లేదని మొన్నామధ్య జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపిస్తే, ఈ పరిస్థితుల్లో కేంద్రానికి అండగా నిలవాలి తప్ప, ప్రధానిని టార్గెట్ చేయకూడదంటూ లెక్చర్ తీసుకున్నారు వైఎస్ జగన్. మరి, ఒప్పుడు ఏ మొహం పెట్టకుని.. ముఖ్యమంత్రులంతా ఒక్కతాటిపైకి రావాలని కోరుతున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

తాను చేస్తే సంసారం.. ఇంకెవరన్నా చేస్తే డాష్ డాష్.. అన్నట్టుంది వ్యవహారం. కేంద్రాన్ని నిలదీయాలి మొర్రో.. అంటూ ఎంతలా విపక్షాలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా పట్టించుకోని జగన్, ఇప్పుడిలా అనూహ్యంగా కేంద్రాన్ని తప్పు పడుతూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఏమో, తెరవెనుకాల ఏదో జరుగుతోంది.

నిజంగానే కేంద్రాన్ని ప్రశ్నించాలని జగన్ భావిస్తున్నారా.? లేదంటే, తాను ప్రశ్నిస్తున్నట్లు జనం అనుకోవాలని జగన్ ఇలా చేశారా.? జగన్ మనసులో ఏముందోగానీ, లేఖ రాయడం మంచిదే.. కేంద్రాన్ని కడిగేయడం కూడా అవసరమే. కానీ, ఇక్కడ జగన్ చిత్తశుద్ధి ఎంత.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.


Recent Random Post: