60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే వుంది. అది 60 – 40 వ్యవహారం. ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితమైన తెరవెనుక బాగోతం కాదు.. ఆయా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే మీడియా సంస్థలకీ పాకిన బాగోతం.

యధా పచ్చ పార్టీ, తథా పచ్చ మీడియా. యధా బులుగు పార్టీ.. తథా బులుగు మీడియా. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణానికి సంబంధించి మొట్టమొదటి బ్రేకింగ్ సదరు ‘దమ్మున్న ఛానెల్’ నుంచే వచ్చింది. ‘తూచ్, అదంతా ఉత్తదే..’ అని బులుగు పార్టీ కథలు వినిపించింది. బులుగు మీడియా కూడా, ‘దమ్మున్న ఛానెల్’ మీద మండిపడింది. కానీ, దమ్మున్న పచ్చ ఛానెల్ చెప్పిందే నిజమయ్యింది.

బులుగు పార్టీ కోసం గతంలో పనిచేసిన వైఎస్ షర్మిల, తెలంగాణలో పార్టీ పెడుతూ, దమ్మున్న పచ్చ ఛానెల్ సాయం కోరినట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చ పార్టీని ఎలాగైతే సదరు దమ్మున్న ఛానెల్ మోస్తోందో, అదే స్థాయిలో తెలంగాణలో బులుగు పార్టీ (కాస్త రంగు మారిన బులుగు పార్టీ.. అదేనండీ షర్మిల పార్టీ) పైన శ్రద్ధ పెడుతోంది. నిఖార్సయిన 60 – 40 సంబంధం అంటే ఇదే మరి. ఈమాత్రం దానికి పచ్చ మీడియా, బులుగు మీడియా మధ్య రాజకీయ వైరం వుందనే ప్రచారం ఎందుకు.?

ఎందుకేమిటి.? అటు పచ్చ కార్మికులు, ఇటు బులుగు కార్మికులు దాన్ని గుడ్డిగా నమ్మేసి.. సదరు మీడియా సంస్థకీ, సదరు రాజకీయ పార్టీకీ బానిసల్లా బతికేయాలి కదా.? మీడియా ఏం చెబితే అదే జనం నమ్మాలనే భావన రాజకీయ పార్టీలో పెరిగిపోవడం వల్లే, రాజకీయ పార్టీలు.. మీడియా సంస్థల్ని లోబరచుకున్నాయి.

అదే సమయంలో, తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలకు ఏనాడో మీడియా సంస్థలు అమ్ముడుపోయాయి. విలువల్లేవ్.. వంకాయల్లేవ్.. అసలు జర్నలిజం ఎథిక్స్ అనేవే లేవు. పాత్రికేయ వ్యభిచారం.. అని ఇలాంటి సందర్భాల్లోనే అనాల్సి వస్తోందని ప్రజాస్వామ్యవాదులు, మీడియా విలువల గురించి ఆలోచించే సీనియర్ పాత్రికేయులూ వాపోతున్నారు.

ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారలో వుండాలి.. ఆ రెండు రంగుల్లో ఏదో ఒకటి మాత్రమే కనిపించాలి.. అంతే తప్ప, ఇంకొకరు కొత్తగా రాజకీయాల్లోకి రాకూడదు.. అసలు రంగు ఏమిటో ప్రజలకు కనిపించకూడదు. ఇదీ బులుగు పచ్చ కామెర్ల 60 – 40 పొలిటికల్ మీడియా కక్కుర్తి.


Recent Random Post: