తెలంగాణ లో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ కోసం సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్న వైఎస్ షర్మిల, ఈ క్రమంలోనే తాజాగా హైద్రాబాద్ వేదికగా మూడు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగ యువతకు మద్దతుగా, ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఈ నిరసన దీక్షను చేపట్టిన షర్మిల, ‘కేసీఆర్.. మీది గుండెనా.? బండ రాయా.?’ అంటూ ప్రశ్నించడం గమనార్హం.
షర్మిల వెంట నాయకులు పలచగా కనిపించారు. నిరుద్యోగులు పెద్దగా ఆమెను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. మూడు రోజులపాటు.. అంటే 72 గంటల పాటు దీక్ష కొనసాగుతుందని షర్మిల చెబుతున్నప్పటికీ, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆమె దీక్షకు అనుమతి వుందని పోలీసులు అంటున్నారు. అంటే, సాయంత్రం 5 గంటల తర్వాత టెంటు పీకేయడం ఖాయమన్నమాట.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య తదితరులు ఈ దీక్షా కార్యక్రమంలో షర్మిల వెంట కనిపించారు. ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభ కోసం పెద్దయెత్తున జనాన్ని సమీకరించగలిగిన వైఎస్ షర్మిల, హైద్రాబాద్ నడిబొడ్డున నిర్వహించిన నిరాహార దీక్షకు మాత్రం ఆ స్థాయిలో నిరుద్యోగ యువతని పోగెయ్యలేకపోవడం ఆశ్చర్యకరమే. కరోనా నేపథ్యంలో చాలామంది ఇలాంటి రాజకీయ కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడటంలేదన్న వాదన వుందనుకోండి.. అది వేరే సంగతి.
కానీ, మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో కావొచ్చు, ప్రస్తుత నాగార్జున సాగర్ ఉప ఎన్నికకి సంబంధించి కావొచ్చు జనం ఆయా రాజకీయ పార్టీల కార్యక్రమాలకు బాగానే పోగవుతున్నారు కదా.? ఇదిలా వుంటే, షర్మిల వెంట నిన్న మొన్నటి దాకా బాగానే తిరిగిన కొందరు నేతలు, షర్మిల దీక్షా శిబిరం వైపు వెళ్ళకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
నిజానికి, కరోనా నేపథ్యంలో షర్మిల, ఈ దీక్షని కొద్ది రోజులు వాయిదా వేసుకుని వుండాలి.. లేదంటే, తన ఇంటి వద్దనే పెద్దగా జనాన్ని పిలవకుండా కార్యక్రమం చేపట్టి వుండాల్సింది. అన్నట్టు, దీక్షకు వచ్చిన ఆ కొద్ది మందిలో ఎవరూ ఫేస్ మాస్కులు ధరించకపోవడం, దీక్షా శిబిరంలో వున్నవారూ మాస్కుల విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వివాదాలకు తావిస్తోంది.
Recent Random Post: