అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్‌పై క్లారిటీ!

Share


అల్లు అర్జున్‌తో ప్యాన్ ఇండియా మూవీ లాక్ కాకముందు, దర్శకుడు అట్లీ మొదటగా సల్మాన్ ఖాన్‌తో ప్లాన్ చేశాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అనేక చర్చలు, వాయిదాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. దీనిపై ఇప్పటివరకు ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

అట్లీ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌ యాక్షన్ మూవీగా ఉండటంతో, ఆ ఖర్చు వర్కౌట్ కాకపోవడంతోనే తాను తప్పుకున్నానని సల్మాన్ స్పష్టం చేశాడు. అయితే, ఈ స్క్రిప్ట్‌లో రజనీకాంత్ వస్తారా? లేదా కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? అన్నది తనకు తెలియదని చెప్పడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఇదే కథను అట్లీ అల్లు అర్జున్‌కు వినిపించి ఒప్పించాడా? లేక కొత్త కథతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, కొన్ని రోజుల క్రితం శివ కార్తికేయన్ పేరు కూడా బలంగా వినిపించింది. కోలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.

అయితే, ప్రస్తుతం అట్లీ దుబాయ్‌లో ఉండి స్క్రిప్ట్ పనులను పూర్తి చేస్తున్నాడు. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత బన్నీ తన కెరీర్‌ను పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడు. అట్లీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.

తాజాగా నిర్మాత నాగ వంశీ చేసిన ప్రకటన ప్రకారం, వేసవి తర్వాత బన్నీ ఒకేసారి రెండు సినిమాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, సల్మాన్ కంటే ఫైనాన్షియల్‌గా బ్యాంకబుల్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడనేది ఖచ్చితంగా అర్థమవుతోంది. అందుకే నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌పై భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు.


Recent Random Post: